దేశంలో డిసెంబర్ 1 నుంచి మళ్ళీ లాక్‌డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

PIB Fact Check Reveals Truth over Rumours of Lockdown Again in India from Dec 1st

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అనంతరం లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తూ దశల వారీ అన్‌లాక్ ప్రక్రియల ద్వారా కంటైన్మెంట్ జోన్ల మినహా ఇతర ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. అయితే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టినా, సెకండ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్నందున డిసెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వం తిరిగి లాక్‌డౌన్‌ విధించబోతోంది అని ఒక ప్రముఖ మీడియా సంస్థ పోస్ట్ చేసినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక ట్వీట్ పై పీఐబీ (భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం) ఫాక్ట్ చెక్ స్పందించింది.

ప్రచారంలో ఉన్న ఆ ట్వీట్ మార్ఫింగ్ చేయబడిందని, దేశంలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించడంపై  ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫాక్ట్ చెక్ వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, సంబంధిత విషయాలపై సోషల్ మీడియాలో జరిగే అనేక తప్పుడు ప్రచారాలపై పీఐబీ ఫాక్ట్ చెక్ నిజ నిర్ధారణ చేసి వివరణ ఇస్తూ ఉంటుంది. మరోవైపు నవంబర్ 13, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,28,795 కు, మరణాల సంఖ్య 1,28,668 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ