దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజు రోజుకి క్రమంగా విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో ఇప్పటికే 536 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, ఈ తరుణంలో ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. లాక్‌డౌన్ సమయంలో ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇళ్లలోనే ఉండాలని చెప్పారు. చాలా అభివృద్ధి చెందిన దేశాలే కరోనా వైరస్ విషయంలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయని, వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ముందు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- మార్చ్ 24, మంగళవారం నాడు అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్. ఇళ్ల నుంచి బయటకు రావడం పూర్తిగా నిషేధం.
- వచ్చే 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకోపోతే తర్వాత పరిస్థితులు చేజారిపోతాయి. బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకొని ఇళ్లలోనే ఉండాలి.
- ప్రతి ఇంటి ముందు మీకు మీరే లక్ష్మణరేఖ గీసుకోవాలి.
- కరోనా వైరస్ మొదటి లక్ష మందికి సోకడానికి 67 రోజులు పడితే, ఆ తర్వాత 11 రోజుల్లోనే ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. అనంతరం మరో నాలుగు రోజుల్లోనే 3 లక్షలకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో లక్ష మందికి సోకడానికి 4 రోజుల సమయమే పడుతుంది.
- కరోనా వైరస్ ఎంతో వేగంగా వ్యాపిచెందుతుంది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
- చైనా, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఇరాన్ దేశాలను కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
- 21 రోజులు పెద్ద సమయమే కానీ మీ ప్రాణాలతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఇదే సరైన మార్గం.
- ఇలాంటి సమయంలో కూడా గడప దాటితే కరోనా మహమ్మారిని మనకి మనమే ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది.
- దేశంలో వైద్య సదుపాయాలు, అత్యవసర టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, అదనపు మౌలిక వసతులు కోసం రూ.15 వేల కోట్లు కేటాయించాం.
- ఈ పరిస్థితుల్లో పలు ప్రైవేటు ఆరోగ్య సంస్థలు కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి.
- దేశంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ప్రాణాల్ని లెక్కచేయకుండా ప్రజల కోసం సేవలు అందిస్తున్నారు.
- పారిశుద్ధ్య కార్మికుల కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను తోలి ప్రాధాన్యం ఆరోగ్యసేవలకే ఇవ్వాలని కోరుతున్నా - నిత్యావసర వస్తువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం.
- ఈ పరిస్థితుల్లో క్రమశిక్షణ, సంయమనం పాటిస్తూ, ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను.
లాక్‌డౌన్ నుంచి మినహాయింపు పొందిన సేవలు:
- ఆసుపత్రి వ్యవస్థల నిర్వహణ
- మెడికల్ షాపులు
- రేషన్ దుకాణాలు
- పండ్లు, కూరగాయలు షాపులు
- ఆహార పదార్థాల షాపులు
- పాలు, మాంసం, చేపల దుకాణాలు
- బ్యాంక్‌లు, బీమా కార్యాలయాలు
- ఏటీఎంలు
- ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
- టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ వ్యవస్థలు
- ఫుడ్, మెడిసిన్స్, వైద్య పరికరాలు సరఫరా చేసే ఆన్లైన్ సేవలు
- పెట్రోల్ బ్యాంకులు
- గ్యాస్ కేంద్రాలు
- నిత్యావసరాల తయారీ యూనిట్లు
- ల్యాబ్‌లు, అంబులెన్స్ లు
- ఎలక్ట్రిసిటీ, వాటర్, పారిశుధ్య సేవలు
లాక్‌డౌన్ నుంచి మినహాయింపు లేని సేవలు:
- రక్షణ, కేంద్ర పారా మిలటరీ బలగాలు
- ట్రెజరీ విభాగం
- ఇంధన మరియు గ్యాస్ సంబంధిత సంస్థలు
- విద్యుత్ ఉత్పత్తి
- పోస్ట్ ఆఫీస్ సేవలు
- సమాచార వ్యవస్థ
- జాతీయ ముందస్తు హెచ్చరికల కేంద్రాలు
- జాతీయ విపత్తు నిర్వహణ