కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చింది. ఇకపై పోర్ట్ బ్లెయిర్‌ను శ్రీ విజయపురంగా వ్యవహరించాలని మోదీ సర్కార్ ప్రకటించింది. వలసవాద ఆనవాళ్ల నుంచి బయటపడటానికి ఈ పేరును మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అంతేకాదు దీనిపై ఎక్స్ వేదికగా గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయంపురంగా మార్చాలని నిర్ణయించామని అందులో తెలిపారు.
మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోందని ఆయన గుర్తు చేశారు. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీకగా షా చెప్పుకొచ్చారు. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకమని అమిత్ షా పేర్కొన్నారు.
చరిత్రతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో కూడా అండమాన్ నికోబార్ దీవులది కీలక పాత్ర అని అమిత్ షా అన్నారు. చోళ సామ్రాజ్యంలో నౌకదళ స్థావరంగా ఉన్న ఈ భూభాగం.. ప్రస్తుతం మన దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆశయాలకు కీలక కేంద్రంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
మన జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఎగురవేశారని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీర్ సావర్కర్‌తో పాటు అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన సెల్యూలర్ జైలు ఇక్కడే ఉందని కూడా వివరించారు.
మరోవైపు నికోబార్ ద్వీపం కేంద్రం ద్వారా 72,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌పై వార్తల్లో ఉంది. ఇది స్వదేశీ షాంపెన్ తెగను స్థానభ్రంశం చేస్తుందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నికోబార్ ద్వీపంలో 244 మంది జనాభాతో షాంపెన్‌లు ప్రధానంగా సంచార జాతుల వేటగాళ్లు ఉండేవాళ్లు.అయితే 2004 సునామీ తరువాత వారు ఇప్పటికే అరణ్యాలలోకి వెళ్లిపోవడంతో.. షాంపెన్లు నివసించని ప్రాంతం కోసం.. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించబడిందని స్థానిక పరిపాలనా అధికారులు చెబుతున్నారు.
అండమాన్ నికోబార్‌లోని 21 దీవులకు ప్రధాని మోదీ పేరు పెట్టారు. గత జనవరిలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరాక్రమ్ దివస్ సందర్భంగా.. యూటీలోని 21 పెద్ద పేరులేని దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. దీనికంటే ముందు రాస్ దీవులుగా పిలిచే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో.. నిర్మించనున్న నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.