అమెరికాలో సరికొత్త చరిత్ర.. కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం

President Donald Trump to Sign on US Paper Currency Notes

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోబోతున్నారు. ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా త్వరలో జరుపుకోనున్న 250వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అమెరికాలో 1861 నుంచి కరెన్సీ నోట్లపై కేవలం ట్రెజరర్ మరియు ట్రెజరీ కార్యదర్శి సంతకాలు ఉండడం ఒక ఆచారంగా వస్తోంది. గత 165 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ సంతకాన్ని నోట్లపై ముద్రించనున్నారు. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌తో పాటు ట్రంప్ సంతకం ఉన్న తొలి 100 డాలర్ల నోట్లను ఈ ఏడాది జూన్ నెలలో ముద్రించనున్నట్లు ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది.

అమెరికా సాధించిన చరిత్రాత్మక విజయాలను గుర్తుచేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గమని ట్రెజరీ కార్యదర్శి బెసెంట్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ ట్రెజరర్ బ్రాండన్ బీజ్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ట్రంప్ ఈ గౌరవానికి పూర్తి అర్హులని పేర్కొన్నారు. దీనితో పాటు, స్వాతంత్ర్య వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో కూడిన స్మారక నాణేలను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మార్పు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరియు కరెన్సీ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here