ప్రపంచ కప్ విజేతలకు రాష్ట్రపతి భవన్‌లో ఆతిథ్యం

President Droupadi Murmu Hosts Women's World Cup Winning Team

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (నవంబర్ 6, 2025) న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ఆతిథ్యం ఇచ్చి, అభినందించారు. రాష్ట్రపతి, జట్టు సభ్యులతో క్షణాలు పంచుకుంటూ వారి కృషి, క్రమశిక్షణ, పట్టుదల గురించి ప్రశంసించారు. భారత మహిళా జట్టు విజయం దేశానికి గర్వకారణమని, యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు.

చరిత్ర సృష్టించారు: ప్రపంచ కప్‌ గెలిచి జట్టు చరిత్ర సృష్టించిందని, దేశంలోని ప్రతి మూల నుంచి, విదేశాల నుంచి కూడా కోట్లాది మంది భారతీయులు ఈ విజయాన్ని ఉత్సవంలా జరుపుకుంటున్నారని రాష్ట్రపతి అన్నారు.

భారతదేశ ప్రతిబింబం: “ఈ జట్టు భారతదేశాన్ని ప్రతిబింబిస్తుంది. వీరు వివిధ ప్రాంతాలు, భిన్న సామాజిక నేపథ్యాలు మరియు వేరు వేరు పరిస్థితుల నుంచి వచ్చారు. కానీ వీరంతా ఒక్కటే.. టీమ్ ఇండియా” అని రాష్ట్రపతి కొనియాడారు. ఈ జట్టు భారతదేశ అత్యుత్తమ స్ఫూర్తిని చూపిస్తోందని ఆమె అన్నారు.

రోల్‌ మోడల్స్: ఈ విజయం ద్వారా జట్టు సభ్యులంతా దేశంలోని యువతరానికి, ముఖ్యంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే బాలికలకు రోల్‌ మోడల్స్ గా నిలిచారని రాష్ట్రపతి పేర్కొన్నారు.

సామర్థ్యాన్ని బలోపేతం చేశారు: ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, టోర్నమెంట్‌లో అప్పటివరకు అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టును ఓడించి, భారతీయులందరి సామర్థ్యంపై నమ్మకాన్ని ఈ జట్టు మరింత బలోపేతం చేసిందని ద్రౌపది ముర్ము అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో బలమైన జట్టుపై భారీ తేడాతో గెలవడం టీమ్ ఇండియా నైపుణ్యానికి మరపురాని ఉదాహరణ అని ప్రశంసించారు.

కెప్టెన్ కానుక: ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ కప్‌ ట్రోఫీని, అలాగే జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి బహూకరించారు. టోర్నమెంట్ భారత్‌లో జరగడం తమకు చాలా ప్రత్యేకమని, “ట్రోఫీ దేశం విడిచి వెళ్లకూడదని” తాము నిర్ణయించుకున్నామని హర్మన్‌ప్రీత్ ఈ సందర్భంగా తెలిపారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీతో నిన్న భేటీ అయిన తర్వాత, ప్రపంచ కప్ విజేతలు ఈరోజు రాష్ట్రపతిని కలుసుకోవడం విశేషం. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు, కోచ్‌లు, మరియు సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. విజేత జట్టు కెప్టెన్ టీమ్ తరఫున రాష్ట్రపతికి జ్ఞాపిక అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here