మారిషస్‌లో ప్రధాని మోదీ..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మారిషస్ చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. మార్చి 12 బుధవారం జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నావికాదళ నౌక కూడా పాల్గొంటుంది. తన రెండు రోజుల పర్యటన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం – మారిషస్ మధ్య సామర్థ్య నిర్మాణం, బిజినెస్, సరిహద్దు ఆర్థిక నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం వంటి రంగాలలో సహకారం వంటి అనేక ఒప్పందాలపై సంతకం చేయనున్నారు.

మరోవైపు మారిషస్‌లోని ప్రవాస భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి.. పోర్ట్ లూయిస్‌లోని ఒక హోటల్ వెలుపల పెద్దఎత్తున తరలివచ్చారు.ప్రధానికి వెల్కమ్ చెప్పడానికి మారిషస్‌లోని భారత హైకమిషనర్ సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య వంటి ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రధాని రాకతో సంబరం చేసుకుంటున్నామని ప్రవాస భారతీయులు చెబుతున్నారు. భారతదేశం – మారిషస్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ బాగుందని… ప్రధాని మోదీ ఈ పర్యటన తర్వాత, ఈ సంబంధం మరింత బలపడుతుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో.. మారిషస్‌లో గంగా తలావ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మారిషస్‌లో అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్ర ప్రాంతంగా పిలువబడే గంగా తలావ్.. భారత్‌లోని పవిత్ర గంగా నదికి ప్రతీకగా చెబుతారు. అలాగే సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో అది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచినట్లు ఇరుదేశాలు భావిస్తున్నాయి. 1972లో గంగా జలాన్ని గంగా తలావ్ నీటిలో కలిపారు.