కేరళలో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలలో బై ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంకా గాంధీని బరిలో దించుతున్నట్లు అధిష్టానం అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పాలక్కడ్, చెలక్కార ఎస్సీ అసెంబ్లీ స్థానాలకు రాహుల్ మమ్‌కూటథిల్, రమ్య హరిదాస్ పేర్లను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపిక చేశారు.ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ తాజా నిర్ణయంతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రియాంకా గాంధీ దిగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ.. కీలకమైన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనే కొనసాగడానికి గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ కేరళలోని వయనాడ్‌ను వదులుకోవడంతో అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.
దీంతో ఖర్గే నివాసంలో జులైలో జరిగిన సమావేశంలో ఇక్కడి నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేయించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికైతే మాత్రం తొలిసారిగా ఆమె పార్లమెంటులోకి అడుగుపెడతారు. అంతేకాదు ప్రియాకం ఈ ఎన్నికల్లో గెలిస్తే ముగ్గురు గాంధీలు అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లు కూడా అవుతుంది.
మరోవైపు మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లో రెండు లోక్‌సభ స్థానాలు 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. దీంతోనే కాంగ్రెస్ పార్టీ కేరళకు సంబంధించి తమ అభ్యర్థులను ప్రకటించింది. కాగా వయనాడ్ లోక్‌సభ సీటుతో పాటు 2 అసెంబ్లీ స్థానాలకు కూడా నవంబర్ 13న పోలింగ్ జరగనుంది.