Sunita Williams: వ్యోమనౌకను భూమిపై ల్యాండ్ చేయకుండా సముద్రంలో దింపడానికి కారణలివే

భారత మూలాలున్న సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. తొమ్మిది నెలల పాటు ISS లో చిక్కుకుపోయిన వీరు, అనేక ప్రయత్నాల అనంతరం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ప్రశాంత వాతావరణం కారణంగా ల్యాండింగ్‌ కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. ల్యాండింగ్ సమయంలో అమెరికా కోస్ట్ గార్డ్ భద్రతా చర్యలు తీసుకుంది. అయితే, వ్యోమనౌకను భూమిపై ల్యాండ్ చేయకుండా సముద్రంలో దింపడానికి పలు వ్యూహాత్మక కారణాలున్నాయి.

అంతరిక్ష ప్రయాణాల విషయంలో రష్యా, అమెరికా భిన్నమైన విధానాలు పాటిస్తాయి. రష్యా తమ స్పేస్ క్యాప్సూల్‌లను భూమిపై ల్యాండ్ చేయగా, అమెరికా వాటిని సముద్రంలో దింపుతుంది. భూమికి తిరిగి వస్తున్న వ్యోమనౌకలు పారాచూట్‌ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని, సముద్ర జలాల్లో మృదువుగా దిగేలా చేస్తాయి. సముద్రంలో ల్యాండింగ్ వల్ల వ్యోమనౌక దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుంది. అదనంగా, వ్యోమనౌక నిర్దేశిత ప్రదేశం నుంచి కొద్దిగా దూరంగా ల్యాండ్ అయినా పెద్దగా సమస్య ఉండదు. పైగా, సహాయక బృందాలు సులభంగా అక్కడికి చేరుకుని వ్యోమగాములను బయటికి తీసుకురావచ్చు.

2011 వరకూ అమెరికా స్పేస్ షటిల్స్‌ను నేలపై ల్యాండ్ చేసేది. కానీ, జెమినీ, అపోలో, మెర్క్యూరీ వంటి మిషన్లు, తాజాగా క్రూ డ్రాగన్ వంటి స్పేస్ క్యాప్సూల్‌లు సముద్రంలోనే ల్యాండ్ అవుతున్నాయి. మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్ కూడా ఇదే విధానం అనుసరించనుంది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ISS కు వెళ్లారు. మొదట ఎనిమిది రోజుల మిషన్‌గా పరిగణించిన ఈ యాత్ర, అనూహ్య సాంకేతిక సమస్యల కారణంగా విపరీతంగా పొడిగించబడింది. సెప్టెంబర్‌లో స్టార్‌లైనర్ వ్యోమనౌక ISS నుంచి వారికి లేకుండానే భూమికి తిరిగి వచ్చేసింది. దీంతో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. నాసా వారి రక్షణకు ప్రయత్నాలు ప్రారంభించింది. చివరికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బాధ్యతను స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు అప్పగించారు. స్పేస్‌ఎక్స్, నాసా కలిసి క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను నింగిలోకి పంపి, వీరిని భూమికి తిరిగి తీసుకువచ్చాయి.

ఇంతటి ఘనమైన రక్షణ చర్య కోసం అమెరికా ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ తయారీ, ప్రయోగ ఖర్చులు కలిపి దాదాపు 140 మిలియన్ డాలర్లు (సుమారు 1,200 కోట్లు) అయ్యాయి. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీనిని నింగిలోకి పంపారు. ఈ వ్యోమనౌకలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగింది.

సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంతో భారత్‌లో ఆనందం వెల్లివిరిసింది. గుజరాత్‌లోని ఆమె బంధువులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారత ప్రధాని సునీతాను అభినందిస్తూ, భారత్‌కు రావాలని ఆహ్వానించారు. మిషన్ విజయంపై సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సునీతా విజయాన్ని ప్రశంసిస్తూ, ఇది ఒక యాక్షన్ మూవీ లాంటి కథ అని ట్వీట్ చేశారు.

286 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ భూమికి తిరిగి రావడంతో, ISS లో గడిపిన దీర్ఘకాలం ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముంది. భూ గురుత్వాకర్షణ శక్తికి మళ్లీ అలవాటు పడేందుకు ఆమెకు ప్రత్యేక వైద్య పరీక్షలు, పునరావాస ప్రణాళికలు అమలు చేయనున్నారు. ఈ ఘనమైన మిషన్ విజయవంతంగా పూర్తవడం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడుగుగా నిలిచింది.