నాసా వ్యోమగామిగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను భూమికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాసా-స్పేస్‌ఎక్స్‌లు సంయుక్తంగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 రాకెట్ మార్చి 15న కెనడీ స్పేస్‌సెంటర్ నుంచి నింగిలోకి ప్రయాణించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావడంతో వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ బృందం స్వాగతం పలికింది. ఈ విజయంతో సునీత తిరుగు ప్రయాణానికి మార్గం సుగమమైంది. నాసా తాజా ప్రకటనలో రిటర్న్ షెడ్యూల్‌ను ప్రకటించింది.
క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు ప్రయాణ షెడ్యూల్ ప్రకారం, సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) హ్యాచ్ మూసివేత ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 12.45 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విజయవంతంగా విడిపోయిన అనంతరం మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమి వైపు ప్రయాణిస్తుంది.
సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్య దాటుకుని కిందకు చేరుకుంటుంది. చివరగా, సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుంది. అనంతరం, స్పేస్‌ఎక్స్ రికవరీ టీమ్ వ్యోమగాములను బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటుంది.
సునీత సహా మిగతా వ్యోమగాములను క్షేమంగా భూమికి తీసుకురావడానికి నాసా అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయిన తర్వాత, స్పేస్‌క్రాఫ్ట్ భూమి వైపు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయంలో సోలార్ ప్యానెల్ల ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ బ్యాటరీలు చార్జింగ్ అవుతాయి. ల్యాండింగ్‌కు 44 నిమిషాల ముందు థ్రస్టర్‌ను ఆన్ చేసి స్పీడ్ తగ్గిస్తారు. చివరగా, ల్యాండింగ్‌కు 3 నిమిషాల ముందు ప్యారాచూట్లు తెరుచుకుని వ్యోమనౌకను సముద్ర జలాల్లో సురక్షితంగా దింపుతాయి.
2024 జూన్ 5న సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. క్రూ-9 మిషన్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వెళ్లిన ఆమె 283 రోజుల పాటు అంతరిక్షంలోనే గడిపింది. కానీ, ఆ వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ భూమికి తిరిగి రాగా, సునీత, బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వీరిని భూమికి తీసుకురావడానికి క్రూ-10 మిషన్‌ను చేపట్టి, లేటెస్టుగా క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను పంపించారు.