ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో నేతలంతా ప్రచారం జోరు పెంచారు. ఫిబ్రవరి 5వ తేదీన 70 స్థానాల్లో పోలింగ్ జరగగా..ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ గెలుపుపై అటు ఆప్, ఇటు బీజేపీ నేతలు చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో సుమారు 8 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉండగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్, రెండు పార్టీలకు ప్రధాదన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఆప్ , బీజేపీ మధ్య హోరాహొరీ పోటీ జరుగుతోంది. దీంతో ప్రతి ఓటు చాలా వీరికి కీలకంగా మారడంతో..అన్ని పార్టీలు ఏ అవకాశాన్ని చేజార్చుకోవడం లేదు.
బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయాలని ఎన్డీఏ మిత్రపక్షాలను ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించడంతో..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. షాద్రా నియోజకవర్గంలో తెలుగు ఓటర్లతో స్వయంగా మాట్లాడారు. బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తినలోనే మకాం వేయగా.. ఇప్పటికే పురందేశ్వరి , బండి సంజయ్ వంటివాళ్లు ప్రచారంలో బిజీ అయిపోయారు. తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే తూర్పు ఢిల్లీ , షాంద్రా ప్రాంతాల్లో మూడు రోజుల పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం చేశారు.
ఢిల్లీలోని అన్నిప్రాంతాల్లో ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ప్రచారం చేస్తున్నారు. త్రీనగర్, ఓంకార్ నగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రచారం చేశారు. షాద్రాలో సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తారు. అలాగే బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. బీజేపీ ఎంఎల్ఏ అభ్యర్థి అజయ్ మహావర్ ను గెలిపించాలని, డిల్లీలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసి నరేంద్ర మోదీకి మరింత బలం చేకూర్చాలని నేతలంతా విజ్ఞప్తి చేశారు.