ఫిబ్రవరి తర్వాత సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షేనా?

The Common Man Will Not Get Gold After February

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. కానీ తగ్గేదేలే అంటూ కనకం మాత్రం పరుగులు పెడుతోంది. ప్రస్తుతానికి 82వేల రూపాయలు దాటేసింది. దీంతో ఇది ఇంతటితో ఆగుతుందా? లక్షమార్క్‌ను దాటేస్తుందా అని మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతేడాది చివరి నుంచి మొదలైన పసిడి పరుగులు ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బ్రేకు లేకుండా సాగుతూనే ఉన్నాయి. మకర సంక్రాంతి సమయంలో అయితే హైదారాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 82వేల రూపాయల మార్క్ దాటేసింది. అప్పటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ట్రంప్ అమెరికాలో అధికారంలోకి వచ్చీ రాగానే పాలసీలు మార్చడంతో.. గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్‌మార్కెట్‌లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ.. ఆ మొత్తాన్ని బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఇటు భారత రిజర్వ్ బ్యాంక్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లు కూడా విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల కూడా బంగారం ధరలు పెరగుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో త్వరలోనే పుత్తడి లక్ష రూపాయల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతుండటంతో.. దేశీయ గోల్డ్ రేట్లు పెరుగుతాయా? బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఫిబ్రవరి 1 తర్వాత బంగారం పయనమెటు అన్న చర్చ జోరందుకుంది. బంగారం ధరలు కట్టడి చేయడానికి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. గతేడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. గోల్డ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో.. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగి వచ్చాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడింది కాబట్టి మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

జులై, 2024లో పసిడి దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో.. ఆ తర్వాతి నెల ఆగస్టు 2024లో గోల్డ్ దిగుమతులు 104 శాతం పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23శాతానికి పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పసిడి వినియోగం భారీగా పెరిగడంతో.. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించడానికి మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. .

బంగారం రేట్లు పెరగడానికి కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒక్కటే కారణం కాదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం సుంకాలు పెంచకపోయినా కూడా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనికి యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ వంటి అంశాలు కారణమవుతాయని చెబుతున్నారు.మొత్తంగా ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్ రేటు సామాన్యులకు అందనంతగా పరుగులు పెట్టే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.