భారతదేశంలో అడుగడుగుకు ఒక దేవాలయం ఉంటుంది. వివిధ మతాలకు తగినట్లుగా హిందూ దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉంటూనే ఉంటాయి. అయితే హిందూ దేవాలయాలు భారత దేశంలో ఉండటం కాదు.. చాలా దేశాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అమెరికా వంటి పెద్ద దేశంలో కూడా హిందూ దేవాలయాలు కొలువై ఉంటాయి. అక్కడ స్థిరపడిన హిందువులంతా పండుగలకు, విశిష్ట తేదీలకు ఆ ఆలయానికి వెళుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హిందూ దేవాలయాన్ని అమెరికాలో నిర్మించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం భారతదేశంలో కాకుండా మొదటిది కాంబోడియాలో ఉండగా.. అమెరికాలో రెండో అతి పెద్ద దేవాలయం ప్రారంభమయింది. తాజాగా న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే సిటీలో.. ప్రపంచంలోనే అతి పెద్ద రెండో హిందూ దేవాలయం అక్టోబర్ 8,2023న ప్రారంభమైంది. స్వామి నారాయణ్ అక్షర్ ధామ్‌గా పిలుచుకునే ఈ మహా మందిరంలో.. అక్టోబర్ 18 నుంచి భక్తుల దర్శనానికి అనుమతిని ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.
స్వామి నారాయణ్ అక్షర్ ధామ్‌గా పిలుస్తున్న ఈ దేవాలయం మహంత్ స్వామి మహారాజ్ గైడెన్స్‌లో నిర్మించారు. ఇటలీ, బల్గేరియా నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు విభిన్న రకాల పాలరాయి, సున్నపు రాయితో ఈ మహా మందిరాన్ని నిర్మించారు. 126 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ గోడలను ..మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహం లింకన్ వంటి నాయకుల చిత్రాలతో అందంగా తీర్చిదిద్దారు.
ఈ ఆలయం గురించి చెప్పుకోవాలంటే.. అడుగడుగునా ఒక అద్భుతంగానే చెప్పుకోవచ్చు. స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని..42 అడుగుల వెడల్పుతో 87 అడుగుల పొడవుతో నిర్మించారు. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఎంతో రీసెర్చ్ చేసి.. ఈ ఆలయాన్ని నిర్మించారు. 2011లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా..నిర్మాణానికి 12 ఏళ్లు పట్టి చివరకు 2023 అక్టోబర్ 8కు పూర్తయింది. అమెరికా వ్యాప్తంగా 12 వేల మందికి పైగా కార్మికులు, అధికారులు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. అంతేకాదు మందిర నిర్మాణంలో సుమారు 10 వేల విగ్రహాల వరకూ ఉపయోగించారు.
స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయంపై.. పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేసేలా కళారూపాలను చెక్కించారు. ఈ మహా ఆలయంలో ఒక ప్రధాన మందిరం, 12 ఉప మందిరాలు, 9 శిఖరాలతో పాటు 9 పిరమిడ్లు కూడా ఉన్నాయి. స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయంలో సాంప్రదాయ రాతి వాస్తు శిల్పకళ ఆధారంగా నిర్మించిన అతి పెద్ద దీర్ఘవృత్తకార గోపురం ఉంది. ఈ గోపురాన్ని 1000 సంవత్సరాలు ఉండేలా రూపొందించారు.
ఈ మహామందిర నిర్మాణానికి సున్నపురాయి, గ్రానైట్‌తో పాటు గులాబీ ఇసుక రాయి, పాలరాయి, దాదాపు 2 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉపయోగించారు. ఇండియా, టర్కీ, చైనా, గ్రీస్, ఇటలీతో పాటు ప్రపంచలోని వివిధ ప్రాంతాల నుంచి రాతిని సేకరించారు. ఈ దేవాలయం వద్ద బ్రహ్మ కుండ్ అని పిలువడే సాంప్రదాయ భారతీయ మెట్ల బావి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 300 నీటి వనరులకు ఉండే నీటి స్థాయిని కలిగి ఉంది.
నిజానికి ప్రపంచంలోనే రెండో అది పెద్ద దేవాలయం అమెరికాలో తాజాగా కట్టించగా.. కాంబోడియాలో అతిపెద్ద మొదటి హిందూ దేవాలయమైన అంగ్ కోర్ వాట్గా గుర్తింపు పొందింది. ఈ దేవాలయం 500 ఎకరాలు విస్తీర్ణంలో ఉండగా.. 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరాన్ని కలిగి ఉంటుంది. ఈ దేవాలయం చుట్టూ శిఖరాలతో.. అద్భుతమైన శిల్పకళ, చుట్టూ ప్రకృతి సౌందర్యం, నీటి సవ్వడిని కలగలసిన ప్రదేశంగా భక్తులతో పాటు పర్యాటకులను కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎన్నో వింతలు, అద్భుతమైన విశేషాలకు నిలయం..ఈ దేవాలయం.