భార్య వేధింపులను తట్టుకోలేక బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతుల్ తన సెల్ఫీ వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ విడుదల చేయగా, తన భార్య నిఖిత సింఘానియా తనను చిత్రహింసలకు గురిచేసిందని ఆరోపించాడు.
తన భార్య రూ. 3 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు నెలకు రూ. 2 లక్షలు భరణంగా ఇవ్వాలని చెప్పినట్టు అతుల్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై చర్చకు దారితీసింది. అంతేకాదు, #MenToo అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ ఘటన జరిగిన 48 గంటలకే సుప్రీంకోర్టు భరణం(Alimony)పై దేశవ్యాప్తంగా అమలయ్యే 8 మార్గదర్శకాలను ప్రకటించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ధర్మాసనం ఈ మార్గదర్శకాలను రూపొందించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు:
భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ.
భార్య, పిల్లల భవిష్యత్తు అవసరాలను అంచనా వేయడం.
ఇరువురి ఉద్యోగాలు, విద్యార్హతలు, ఆదాయాలు, ఆస్తుల వివరాలు.
భార్య అత్తవారింట్లో జీవన ప్రమాణం.
కుటుంబం కోసం భార్య ఉద్యోగాన్ని వదిలేసిందా అన్న విషయాన్ని తెలుసుకోవడం.
ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన భరణం అందించడం.
భర్త ఆర్థిక పరిస్థితి, ఆదాయాలు, ఇతర బాధ్యతల పరిశీలన.
భరణం నిర్ణయంలో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవడం.
చట్టం దుర్వినియోగం పై చర్చ
వరకట్న వేధింపుల చట్టం మగవారిపై కఠినంగా అమలవుతున్నప్పటికీ, దుర్వినియోగం కారణంగా దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో నిఖిత తన భర్తను తప్పుడు కేసులతో వేధించిందని అతుల్ తన సూసైడ్ నోట్లో వివరించాడు.
తన మరణానికి ముందే అతుల్ తన పనులను ప్లాన్ చేసి పూర్తి చేశాడు. తన ల్యాప్‌టాప్ ద్వారా సూసైడ్ నోట్‌ను అనేక మందికి పంపించడంతో పాటు తన ఆస్తుల బాధ్యతలను తీర్చాడు. అతని సూసైడ్ నోట్, వీడియో “పురుషుల కోసం న్యాయం కావాలి” అనే నినాదానికి మార్గదర్శకంగా మారాయి.
ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఆందోళనలు మిన్నంటాయి. “చట్టాలు పురుషులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది” అనే నినాదాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ద్వారా భరణం విషయంలో సమానత సాధించాలని న్యాయవేత్తలు సూచించారు.