దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం కేంద్ర క్యాబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి నివేదిస్తారని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి . ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తుందని వెల్లడించాయి.
బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని, సగానికిపైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, జమిలి ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబరులో ఏర్పాటైన రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫారసులను కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించింది. కోవింద్ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించాయి. బీజేపీ, బీజేడీ, జేడీయూ, శివసేన వీటిలో ఉన్నాయి. వనరులు ఆదా కావడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం, ఏకకాలంలో దేశం అభివృద్ది జరగడం దీనివల్ల సాధ్యపడతాయని భావించాయి.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని 83, 172 అధికరణలను సవరించాలని కమిటీ సూచించింది. దీనివల్ల రాష్ట్రపతి, గవర్నర్ రద్దు చేస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీల పదవీకాలం అయిదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది. బీజేపీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్నికలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు అనేక పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ విషయాన్ని జేపీసీకి నివేదించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి .
జేపీసీ ఏర్పాటయితే దాని ద్వారా అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, సామాన్యుల అభిప్రాయాలను కూడా సేకరించడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని మార్చడం భారీ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఏకాభిప్రాయ సాధన తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయన్న విషయం చర్చ జరుగుతోంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది . కనుక 2029 వరకు ఈ ఎన్నికలకు సన్నద్ధం కావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి ఈ ఎన్నికల ప్రక్రియను ముందుకు జరపవచ్చునని కూడా చర్చ జరుగుతోంది.