5 లక్షల మందికి షాకిచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలను చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ వరుసగా సంచలన నిర్ణయాలను తీసుకుంటూ.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటి వరకూ 37 వేల మందికిపైగా అక్రమ వలసదారులను గుర్తించిన అధికారులు.. వారిని వారివారి దేశాలు పంపించారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈసారి ఏకంగా 5 లక్షల మంది నివాస హోదాను రద్దు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతో..తాజాగా అమెరికాలో 5 లక్షల మందికి నివాస హోదాను రద్దు చేస్తూ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన చేసింది. ట్రంప్ ప్రకటనతో.. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా నుంచి వచ్చిన దాదాపు 5 లక్షల32వేల మంది వలసదారుల నివాస హోదా నెల రోజుల్లోగా రద‍్దవబోతోంది. వీరంతా 2022 అక్టోబర్ నుంచి అమెరికాలో ఉంటున్నట్లు అమెరికాలోని అధికారులు గుర్తించారు.

బైడెన్ పరిపాలన కాలంలో అమలు చేసిన ..హ్యూమానిటేరియన్ పరోల్ పథకం కింద రెండేళ్ల నివాస, పని అనుమతులతో వీరంతా ఉన్నట్లు తెలుస్తోంది. తాజా రద్దు ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్‌ఎస్‌ స్పష్టం చేసింది. అంటే ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ విడుదల అయిన 30 రోజుల తర్వాత దీని అమలు జరుగుతుందని తెలుస్తోంది. ఈ చర్యను హ్యూమానిటేరియన్ పరోల్ యొక్క దుర్వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో ట్రంప్ పరిపాలన తీసుకుందని చెబుతోంది. హ్యూమానిటేరియన్ పరోల్ పథకం అనేది గతంలో యుద్ధం లేదా రాజకీయ అస్థిరతలు ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి.. టెంపరరీ షెల్టర్ కల్పించడానికి ఉపయోగపడింది.

కాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసలను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఆ దిశగానే అడుగులు వేశారు. తాజాగా మరో 5 లక్షల మందికి షాక్ ఇచ్చారు. ఈ పథకం రద్దుతో క్యూబా, వెనిజులా, నికరాగ్వా దేశాలు డిపోర్టేషన్‌లను సాధారణంగా అంగీకరించకపోతే..అమలు చేయడంలో సవాళ్లు ఎదురవ్వొచ్చు. ఇప్పటికే కొంతమంది ఈ పథకాన్ని కొనసాగించాలని రద్దు చేయొద్దని దావా వేసినట్లు తెలుస్తోంది.