అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన భారతదేశం, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అమెరికా నుంచి ఎవరు సుంకాలు వసూలు చేసినా, వారి నుంచి కూడా వసూలు చేస్తామని అన్నారు. అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ జాయింట్ సెషన్‌లో ప్రసంగించిన ట్రంప్, తన ప్రభుత్వ పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. అమెరికా తిరిగి అగ్రస్థానానికి చేరిందని, విశ్వాసం, గర్వం తిరిగి వచ్చాయని అన్నారు. 43 రోజుల్లో 400 కి పైగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కృషి చేస్తానని ట్రంప్ అన్నారు. WHO నుండి వైదొలగాలని నిర్ణయించామని, అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీషును ప్రకటిస్తూ ఉత్తర్వు జారీ చేశానని తెలిపారు. ఉద్యోగ నియామకాలు ప్రతిభ ఆధారంగా ఉంటాయని స్పష్టం చేశారు. అమెరికాలో గుడ్ల ధరలు పెరిగాయని, అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నామని ట్రంప్ తెలిపారు. అలాస్కాలో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం, విద్యుత్ ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయడానికి DOGEని ఏర్పాటు చేసి, దాని బాధ్యత ఎలోన్ మస్క్‌కు అప్పగించానని తెలిపారు.
చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలు సుంకాలు వసూలు చేస్తున్నాయని, దీనికి ప్రతిగా ఏప్రిల్ 2 నుంచి అమెరికా సుంకాలు విధిస్తుందని ట్రంప్ తెలిపారు. పోలీసుల భద్రతను పెంచేందుకు, పోలీసు అధికారిని హత్య చేసిన వారికి మరణశిక్ష విధించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి మెలానియా ట్రంప్ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో తుపాకీదాడిలో మరణించిన అగ్నిమాపక సిబ్బంది కుటుంబం, రష్యా ప్రభుత్వం బందీగా ఉంచిన అమెరికన్ టీచర్, అక్రమ వలసదారుడి దాడిలో మరణించిన నర్సింగ్ విద్యార్థి కుటుంబం ఉన్నారు.