దేశంలో నక్సలిజం అంతమైంది – లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Union Home Minister Amit Shah Declared in Lok Sabha, Naxalism Almost Eradicated From India

భారతదేశంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నక్సలిజం మరియు వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం వామపక్ష తీవ్రవాదంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, నక్సలిజాన్ని నిర్మూలించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలను వివరించారు.

ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నక్సలిజం కోరలు పీకేశామని, అభివృద్ధి ఫలాలు గిరిజన గ్రామాలకు చేరుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసే వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని, అయితే ఆయుధాలు ధరించిన వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

గత యూపీఏ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ విధానాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలోనే నక్సలిజం ఉధృతమైందని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా వారిని విస్మరించడం వల్లే యువత ఆయుధాల బాట పట్టారని విమర్శించారు. మావోయిస్టు సానుభూతిపరులతో కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధాలను ఆయన ఎండగట్టారు.

2018లో రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో గద్దర్‌తో భేటీ అవ్వడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అర్బన్ నక్సలైట్లు మరియు వారి సానుభూతిపరులు మావోయిస్టుల హింసను సమర్థిస్తూ వేలాది వ్యాసాలు రాస్తున్నారని, కానీ వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల గురించి ఎందుకు మాట్లాడరని ఆయన నిలదీశారు.

ఆపరేషన్ వివరాలు – ముఖ్యాంశాలు:
  • మావోయిస్టుల ఏరివేత: ఇప్పటివరకు 4,839 మంది నక్సలైట్లు లొంగిపోయారని, 706 మంది ఎన్‌కౌంటర్లలో మరణించారని హోంమంత్రి వెల్లడించారు.

  • ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో 21 రోజుల పాటు 45 డిగ్రీల ఎండలో జరిపిన ఈ ఆపరేషన్ మావోయిస్టుల నడ్డి విరిచిందని ఆయన కొనియాడారు.

  • తెలంగాణ పోలీసుల పాత్ర: మావోయిస్టులను అడ్డుకోవడంలో తెలంగాణ పోలీసుల (గ్రేహౌండ్స్) సహకారం మరువలేనిదని, వారి పోరాటం వల్లే నేడు తెలంగాణ కమిటీలో మావోయిస్టుల ప్రాతినిధ్యం శూన్యమని చెప్పారు.

  • సంక్షేమ పథకాలు: ప్రతి గిరిజన గ్రామంలో పాఠశాలలు, రేషన్ షాపులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికీ 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుపై విమర్శలు:

సల్వాజుడుం కేసులో 2011లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు వల్ల అనేక మంది ప్రాణాలు పోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఎస్పీవోల వద్ద ఉన్న ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఆయన ఆదేశించడం వల్ల, రక్షణ లేని ఆ యువకులను నక్సలైట్లు ఏరికోరి చంపేశారని మండిపడ్డారు.

జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన వ్యక్తిగత ఎజెండాకు రాజ్యాంగ ముసుగు వేసి తీర్పులు ఇచ్చారని, అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎలా నిలబెడుతుందని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతలపై నమ్మకం ఉన్న ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోదని విమర్శించారు.

నక్సలిజం అనేది పేదరికం వల్ల కాకుండా ఒక ప్రమాదకరమైన విదేశీ ప్రేరిత సిద్ధాంతం వల్ల వ్యాపించిందని అమిత్ షా విశ్లేషించారు. విదేశీ భావజాలంతో దేశాన్ని అస్థిరపరిచే శక్తులను సహించేది లేదని, మార్చి 31 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here