మళ్లీ వేడెక్కిన చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం.. 104 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా

అగ్రరాజ్యమైన అమెరికా, ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాల మధ్య సుంకాల పోరు రోజురోజుకీ పెరుగుతోంది. తాజా పరిణామాల్లో అమెరికా చైనా మీద విధిస్తున్న సుంకాలను 104 శాతానికి పెంచింది. ఏప్రిల్ 9 నుంచి ఈ కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దృఢమైన వైఖరితో చైనాపై మరోసారి ప్రతీకార చర్యలు తీసుకున్నారు. ఇటీవల చైనా, అమెరికా దిగుమతులపై 34 శాతం అదనపు సుంకాలు విధించనుంది అనే ప్రకటనతో ట్రంప్ మండిపడ్డారు. ఏప్రిల్ 8 లోగా చైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. కానీ చైనా స్పందించకపోవడంతో, ట్రంప్ మాటనుబట్టి అదనంగా మరో 50 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు.

ముందుగా అమెరికా చైనా వస్తువులపై 10 శాతం సుంకాలు విధించగా, తాజాగా పెంచిన వాటితో కలిపి మొత్తం సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇది చైనాకు తీవ్రమైన ఆర్థిక పంచ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ట్రంప్ తాజా ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా భారీ ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి చివరికి 2 నుండి 3.5 శాతం నష్టాలతో ముగిశాయి.ఈ వాణిజ్య యుద్ధం ఆగేదెలా అన్నదే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.