తమిళ సినీ నటుడు వెట్రి కజగం పార్టీ పార్టీ అధినేత దళపతి విజయ్ తన మొదటి పొలిటికల్ స్పీచ్ తోనే ప్రజలను ఆకట్టుకున్నాడు. తమిళనాడు విల్లుపురం జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం మహానాడు సభను ఏర్పాటు చేయగా దాదాపు పది లక్షల మంది సభకు హాజరైనారు. నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు అని పేర్కొన్న విజయ్.. ద్రవిడాన్ని, తమిళ జాతీయతను తమ పార్టీ వేరుగా చూడదని స్పష్టం చేశారు. ఈవీఆర్ పెరియార్, కే కామరాజ్ లాంటి నేతల ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలతో ఏర్పడిందన్నారు.
లౌకిక మరియు సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం అని తెలిపాడు. ప్రతిదీ, ప్రతి ఒక్కరికీ అనే నినాదంతో పార్టీ పనిచేస్తుంది. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తాం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం అని ధీమా వ్యక్తం చేసారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వారు ద్రవిడ మోడల్ ప్రభుత్వంగా పిలుస్తున్నారని అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని, వారు రాజకీయ రంగంలో ప్రవేశించిన అనంతరం కూడా తమ సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులను దోచుకున్నారని పేర్కొన్నారు.
బీజేపీతో తాము సిద్ధాంతపరంగా విభేదిస్తామని, డీఎంకే పార్టీని రాజకీయంగా వ్యతిరేకిస్తామని చెబుతూ విజయ్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. సమాజంలో చీలికలు తీసుకువచ్చేందుకు ఓ గ్రూప్ ప్రయత్నిస్తోందని, సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించేవాళ్లు తమకు మొదటి శత్రువులని విజయ్ ఉద్ఘాటించారు. కొన్ని సంవత్సరాల క్రితం కమల్ హాసన్ రాజకీయాల్లోకి రాగా ఆయన అంత ప్రభావం చూపలేకపోయారు. రజనీకాంత్ వద్దామనుకున్న అనారోగ్యం వలన తప్పుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ టైం వచ్చింది. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీని ఏర్పాటు చేసి రాజకీయాల్లో తన సత్తా నిరూపించేందుకు అడుగులు వేస్తున్నారు.