తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయ పార్టీ పెట్టడం తమిళనాటే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తమిళ వెట్రి కజగం అనే పేరుతో విజయ్ పార్టీని స్థాపించిన.. ఎప్పటి నుంచో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలకు తన ఎంట్రీతో ముగింపు ఇచ్చాడు. అయితే విజయ్ తను పార్టీ పెట్టినా తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయనని అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు.
అయితే ప్రస్తుతం విజయ్ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేసి వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి ఊతమిచ్చినట్లుగానే తాజాగా విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించరించాడు. చెన్నైలో జరిగిన తన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ ..తన పార్టీ జెండాపై ప్రకటన చేసి అనంతరం..జెండాను ఆవిష్కరించి దాని గురించి మాట్లాడాడు. అయితే త్వరలోనే టీవీకే పార్టీ తిరుచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండా చూడటానికి సంథింగ్ స్పెషల్గా ఉంది.జెండా పైన, కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్ తో ఉంది. వాటి మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తున్నట్లు, వాటి మధ్య మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు ఉంది. అలాగే వాటి చుట్టూ నక్షత్రాలు ఉన్నాయి.
ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో తెగ సర్కిల్ అవుతోంది. ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించి, ఇప్పుడు జెండాని ఆవిష్కరించడంతో.. విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో త్వరలోనే తమిళ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి 2026 తమిళనాడులో జరిగే ఎన్నికలలో విజయ్ తన పార్టీ ద్వారా ఎలాంటి ప్రభావం చూపిస్తాడో వేచి చూడాలి.