దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తరువాత, తీవ్ర వాదోపవాదాల మధ్య లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా అధికార పార్టీ, వ్యతిరేకంగా విపక్షాలు తీవ్రంగా పోటీపడ్డాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బిల్లుపై చర్చలు, ఓటింగ్ వివరాలు
ఈ బిల్లుపై రెండు రోజుల పాటు పార్లమెంట్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. లొక్సభలో 288 ఓట్లు అనుకూలంగా, 232 ఓట్లు వ్యతిరేకంగా పోలయ్యాయి. రాజ్యసభలోనూ ఈ బిల్లుపై వివాదాస్పద చర్చలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షాలు ప్రతీ సవరణపై ఓటింగ్ కోసం ఒత్తిడి తెచ్చినా, అంతిమంగా 128-95 ఓట్ల మెజారిటీతో బిల్లు ఆమోదం పొందింది.
వక్ఫ్ (సవరణ) బిల్లులోని ముఖ్య నిబంధనలు
వక్ఫ్ దానం చేసే వ్యక్తికి కనీసం 5 సంవత్సరాల పాటు ఇస్లాం ఆచరణ అనుభవం ఉండాలి.
వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం డిజిటల్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు.
UMEED అనే ప్రాజెక్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను సురక్షితంగా పరిరక్షించేందుకు చర్యలు చేపడతారు.
1995 వక్ఫ్ చట్టంలో మార్పులు, వక్ఫ్ బోర్డుల ఆడిట్, రిజిస్ట్రేషన్, ఖాతాల ప్రచురణపై కేంద్రానికి అధికారం లభించింది.
షియా, సున్నీ వర్గాలతో పాటు బోహ్రా, అగాఖాన్ వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులు ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు.
ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టంగా అమలులోకి రానుంది. అయితే, ఈ బిల్లుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.