ఉత్తర ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భోలే బాబా ఆధ్యాత్మిక కార్యక్రమం పలువురి కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. భోలే బాబా పాద ధూళి కోసం వచ్చిన భక్తులు మట్టిలోనే కలిసిపోయారు. స్థానిక గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా హాథ్రస్ జిల్లా పుల్రాయ్ గ్రామంలో శివారాధన నిర్వహిస్తారు. తాజాగా నిర్వహించి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో భోలే బాబా పాద దూళి కోసం ఒక్కసారిగా భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 121 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 108 మంది మహిళలు.. ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
హాథ్రస్ జిల్లా పుల్రాయి గ్రామంలో ప్రతి మంగళవారం భోలే బాబా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా నిర్వహిస్తుండగా పోలీసులు కేవలం 80 వేల మంది మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు. కానీ మంగళవారం 2.5 లక్షల మంది జనాలు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషాద ఘటన చోటుచేసుకున్న తర్వాత భోలే బాబా కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని కూడా ప్రకటించాయి.
అయితే ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఎవరీ భోలే బాబా అనే అంశం చర్చనీయాంశ మయింది. పెద్ద ఎత్తున నెటిజన్లు ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో బోలే బాబా గురించి వెతుకుతున్నారు. బోలే బాబా అసలు పేరు అకా నారాయణ్ సాకర్ హరి. ఆయన యూపీలోని ఎటా జిల్లా బహదూర్ నగరి గ్రామంలో జన్మించారు. ఎటా జిల్లాలోనే డిగ్రీ పూర్తి చేసి అకా నారాయణ్.. ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేశారు. పాతికేళ్ల క్రితం తన ఉద్యోగానికి నారాయణ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత తన పేరును భోలే బాబాగా మార్చుకొని.. ఆధ్యాత్మిక బాట పట్టారు. తనకు గురువు అంటూ ఎవరూ లేరని చెప్పుకునే వాడు. కేవలం సమాజహితం కోసమే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పుకునేవాడు.
ప్రతి మంగళవారం హాథ్రస్ జిల్లాలో భోలే బాబ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆయనకు ఒక్క యూపీలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు. కరోనా సమయంలో కూడా ఆయన తన కార్యక్రమాలకు బ్రేక్ ఇవ్వలేదు. ఆసమయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే వారు. తనపై జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు. తాజాగా నిర్వహించిన కార్యక్రమానికి అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు హాజరు కావడంతో విషాదం చోటుచేసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY