దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అవినీతి కేసులో జైలుకు వెళ్లొచ్చిన మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక రకంగా అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. మరోవైపు కేంద్రంలో మూడుసార్లు బీజేపీ అధికారం చేపట్టినా…ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం ప్రధాని మోదీకి, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక గతంలో ఏకఛత్రాధిపత్యం వహించిన ఢిల్లీ అసెంబ్లీలో ఉనికిని నిరూపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యావశ్యకం. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు తలపడుతుండటంతో త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుతారోననే ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీలో మరోసారి పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సాధిస్తే కేజ్రీవాల్ వరుసగా నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను అక్రమంగా ఇరికించిందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజలు తనవెంట ఉన్నారని, ప్రజాతీర్పు తనకు శిరోధార్యమని చెప్పడంతోపాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఆప్ ఓడితే మాత్రం కేజ్రీవాల్‌కు రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన అగ్రనేతలతో ఆప్ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా….ఇప్పటికే ఉచితంగా అందిస్తున్న పథకాలపై ఆధారపడే ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనడానికి ఆప్ సిద్దమవుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు అందరికీ అందకపోయినా…అవే తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయనే ఆశ ఆప్‌లో కనిపిస్తోంది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం ఆప్‌కు కలిసివచ్చే అంశంగా మారింది.
ఇక ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండంటూ అభివృద్ధి మంత్రంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రజల ముందుకు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పార్లమెంటు స్థానాలను క్లీన్ స్వీప్ చేసే బీజేపీ…అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఘోరంగా ఓడిపోతోంది. 25ఏళ్లుగా ఆ పార్టీ అధికారం సాధించలేకపోతోంది. స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడం…ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో మోదీ, అమిత్ షాలే అన్నీ తామై ప్రచారం చేయాల్సి వస్తోంది. ఆప్ నేతలతోపాటు కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలను బీజేపీ అస్త్రంగా మలుచుకుంటోంది.
ఇక బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున తామే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈసారి తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన షీలాదీక్షిత్‌లాంటి నేత లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీదీ యోజన పేరుతో మహిళలకు నెలకు 2500 ఇస్తామని ప్రకటించి మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.