భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటోందని ఆర్థిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా చేరిపోయింది . దీనికి తోడు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త విధానాలు, నిర్ణయాలతో మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్లు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
ఇలాంటి సమయంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ జర్మనీ, జపాన్ కంటే పెద్దగా మారుతుందని.. అంతేకాదు 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా భారత్ అవతరించవచ్చని చెప్పారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సీఈఓ.. భారత్ ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే దానికి ఉన్న ఏకైక అతిపెద్ద ప్రయోజనం దాని ప్రజాస్వామ్యమేనని వివరించారు.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెప్పిన సుబ్రహ్మణ్యం..వచ్చే ఏడాది చివరి నాటికి నాల్గవ అతిపెద్ద దేశంగా ఉంటుందని అన్నారు. ఆ తర్వాత ఏడాది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తందని అన్నారు.IMF తెలిపిన డేటా ప్రకారం..భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం USD 4.3 ట్రిలియన్లలలో జర్మనీ ,జపాన్ కంటే భారత్ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లా సంస్థలు, అకౌంటింగ్ సంస్థలతో పాటు భారతీయ కంపెనీలు ప్రపంచ నాయకులుగా ఎదగాలని అంతా ఆకాంక్షించాలని సుబ్రహ్మణ్యం కోరారు.
అంతేకాదు మధ్య ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు, తక్కువ ఆదాయ దేశాల సమస్యలకు చాలా తేడా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ వివరించారు. ఇది కేవలం పేదలకు ఆహారం పెట్టడం లేదా దుస్తులు ధరించడం గురించి కాదని.. ప్రజలు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా ఎలా మారతారనే దాని గురించంటూ చెప్పారు. జపాన్ 15,000 మంది భారతీయ నర్సులను తీసుకుంటోందని..జర్మనీ 20,000 మంది ఆరోగ్య కార్యకర్తలను తీసుకువెళుతోందని సబ్రహ్మణ్యం చెప్పారు. ఎందుకంటే వారి వద్ద ప్రజలు లేరని.. అక్కడ కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పని చేసే వయస్సు గల వ్యక్తులకు భారత్ ఎప్పుడూ స్థిరమైన సరఫరాదారుగా ఉంటుందన్న నీతి ఆయోగ్ సీఈవో.. ఇదే తమ ఏకైక అతిపెద్ద బలం అవుతుందని సుబ్రహ్మణ్యం ఆశాభావం వ్యక్తం చేశారు.