ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025 సమీపిస్తుండటంతో.. సామాన్యులకు ఈ సారి అన్నిరకాలుగా భారం తగ్గుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, ఫిబ్రవరి బడ్జెట్లో వార్షిక ఆదాయం 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉన్నవారికి పన్ను రేటును తగ్గించవచ్చని చెబుతున్నారు.
మధ్యతరగతి ట్యాక్స్ పేయర్స్‌కు ఉపశమనం కలిగించడానికి ఆదాయపు పన్ను శ్లాబులలో మార్పులు చేయొచ్చని తెలుస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది.
గృహ రుణాలపై కొత్త పన్ను విధానంలో ప్రయోజనాలు ఉంటాయనే వాదన వినిపిస్తోంంది. పాత పన్ను విధానం కంటే తక్కువగా ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో మరిన్ని ప్రయోజనాలను అందించడం ద్వారా ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు . దీనిలో సెక్షన్ 24(బి) కింద హౌసింగ్ లోన్‌పై వడ్డీ మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని.. కనీసం ఒక ఇంటికి చెల్లించే మొత్తం వడ్డీపైన అయినా మినహాయింపును అనుమతించాలని కోరుతున్నారు.
ఎన్పీఎస్ అదనపు మినహాయింపు లిమిట్‌ను రూ. 50,000 నుంచి రూ. 1,00,000కి పెంచాలని, NPS నుంచి ఉపసంహరణలను పూర్తిగా పన్ను రహితంగా చేయాలన్న వాదన కూడా వినిపిస్తోంది.అలాగే టైర్-2 నగరాలయిన హైదరాబాద్, పూణే, బెంగళూరు వంటి అధిక వ్యయంతో కూడిన పట్టణ కేంద్రాలలో ఉంటున్న ట్యాక్స్ పేయర్స్‌కు ఉపశమనం కలిగించడానికి, HRA మినహాయింపును 50%కి పెంచాలని కోరుతున్నారు.
పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 80డి కింద ట్యాక్స్ పే లిమిట్‌ను వ్యక్తులకు రూ. 25,000, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 నుంచి వరుసగా రూ. 50,000, రూ. 1,00,000కి పెంచితే బాగుంటుందని ఆశిస్తున్నారు.
పీఎఫ్ వడ్డీపై TDSలో మార్పు ఉంటే బాగుంటుందన్న అంచనాలున్నాయి. రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పిఎఫ్ వడ్డీపై పన్ను మినహాయింపు ఉపసంహరణ సమయం వరకు వాయిదా వేయాలని, దీని ద్వారా పన్ను చెల్లింపుదారులకు నగదు ప్రవాహం మెరుగుపడుతుందన్న భావన ఉంది.
బడ్జెట్ 2024 నుంచి పెట్టుబడి లాభాలపై ట్యాక్స్‌కు చేసిన మార్పులను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ, భారతీయ స్టాక్‌లపై సమానంగా ట్యాక్స్ విధించాలని, వివిధ రకాల బంగారం పెట్టుబడులపై ట్యాక్స్ రేట్లు ఒకే విధంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. స్టాక్ లాభాలపై పన్ను పెరగడం వల్ల స్వల్పకాలానికి 15% నుంచి 20%, దీర్ఘకాలికంగా 10% నుంచి 12.5% వరకు పన్ను స్టాక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తొలగించాలని అభిప్రాయపడుతున్నారు.