9 రోజుల్లో 170 విమానాలకు బాంబు బెదిరింపులు..24 గంటల్లోనే ఏకంగా 80 విమానాలకు బెదిరింపులు. కేంద్రమంత్రి హెచ్చరించినా.. బెదిరింపులు అడ్డుకోవడానికి భద్రతా సంస్థలు పనిచేస్తున్నా బెదిరింపులు ఏమాత్రం ఆగడం లేదు. ఫోన్‌లు, ఈమెయిళ్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులతో విమాన ప్రయాణాలు చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇటు విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హెచ్చరించినా కూడా ఆకతాయిల దుశ్చర్యలు ఏమాత్రం ఆగడం లేదు.
విమానంలో బాంబు పెట్టామని దుండగులు, ఆకతాయిలు పంపిస్తున్న హెచ్చరికలతో..ప్రయాణికులతో పాటు.. విమానయాన సంస్థలకు కూడా నష్టం జరుగుతుంది. నిజానికి ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ ప్రొటోకాల్, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీలు చేయాల్సిందే. దీంతో ఆయా విమానాలు ఆలస్యమవుతున్నాయి. అప్పటికే గమ్యస్థానం నుంచి బయలుదేరిన విమానాలను ఉన్నపళంగా వేర్వేరు విమానాశ్రయాలకు దారి మళ్లించాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి. దీనివల్ల విమానయాన సంస్థలు బాగా నష్టపోతున్నాయి.
ఈ తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపులకు విమానయాన సంస్థలు సుమారుగా 600 కోట్ల రూపాయలు నష్టపోయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ.1.5 కోట్లు నష్టం వస్తుంది. అదే అంతర్జాతీయ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే.సగటున రూ.3.5 కోట్ల వరకు నష్టం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ విమానాలకు వస్తున్న బెదిరింపులన్నీ నకిలీవే. ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఆకతాయిల బెదిరింపులు వచ్చేవి. కానీ ఇప్పుడు వరుసగా బెదిరింపులు వస్తుండటంతో బెదిరింపుల వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించ వద్దని ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ హెచ్చరించడంతో కాస్త ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో విమానయాన రంగానికి ఇంతగా ఆటంకం కలిగిస్తున్న బాంబు బెదిరింపుదారులకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ ను విసురుతుంది. ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చి.. వారిని ఎప్పటికీ విమానాలు ఎక్కకుండా నిషేధించాలని విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిని వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి.. సప్రెషన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్ట్స్ అగైనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్-1982కు సవరణ చేయాలని డిసైడ్ అయింది. మరి ఇకపై అయినా ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ ఆగుతాయేమో చూడాలి.