ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన లాంగ్ ఐలాండ్‌లో భారతీయ ప్రవాసులతో సమావేశమయ్యారు. ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో రెండు కొత్త కాన్సులేట్లను భారత్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ నగరాల్లో కాన్సులేట్ ఆఫీసులను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ అమెరికన్స్ చాలా రోజులుగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోదీ చొరవతో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని కితాబిచ్చారు. ఇరు దేశాల మధ్య ప్రవాసులు వారధులని అన్నారు. ప్రవాస భారతీయులు ఇరుదేశాలను అనుసంధానించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతేగాక, ఏఐ అంటే కొత్త నిర్వచనం చెప్పారు. ఏఐ అంటే అమెరికాన్ ఇండియన్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు భారత్ అవకాశాల గని అని చెప్పారు. అవకాశాల కోసం ఎదురుచూసే కాలం పోయిందన్నారు. కాగా, గతంలో తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారన్నారు.
మరోవైపు, క్వాడ్ సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని మోడీ, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. బైడెన్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు మోడీ తెలిపారు. చర్చలు ఫలప్రదమైనట్టు భేటీ అనంతరం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలోని బైడెన్ నివాసంలో తనకు ఆతిథ్యమిచ్చినందుకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.
భారత్‌తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైంది, సన్నిహితమైంది, చైతన్యవంతమైందని బైడెన్ చెప్పారు. ప్రధాని మోడీ, తాను చర్చలకు కూర్చున్న ప్రతిసారీ కొత్త సహకార రంగాలను కనుగొనగల ఇరు దేశాల సామర్థ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ విడివిడిగా జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ రీజియన్శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.