కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ఇటీవల కీలక నిర్ణయాన్ని తీసుకున్న టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ఇప్పుడు దానిని వెనక్కి తీసుకున్నాయి. ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చని ప్రకటించాయి. ఇటీవల ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులకు డిస్కమ్‌లు గుడ్బై చెప్పాయి. కానీ నెల రోజుల్లోనే వసూళ్ల సీన్ మొత్తం రివర్స్ అయి.. కరెంట్ బిల్లుల చెల్లింపులు భారీగా తగ్గిపోవడంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. దీంతో ఫోన్ పే చెల్లింపులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్సైట్‌తో పాటు ఫోన్ పే ద్వారా కూడా ప్రస్తుత చెల్లింపులు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. గతంలో వినియోగదారులు ప్రతినెలా కరెంటు ఆఫీసులకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి మరీ బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ రంగం విస్తరించడంతో.. కరెంట్ బిల్లుల చెల్లింపులను కూడా దానిలోనే కట్టేవారు. అయితే ఇకపై ఫోన్ పే, గూగుల్ పే ద్వారా బిల్లులు చెల్లింపులు వద్దని ..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం నెల రోజుల క్రితమే డిస్కమ్‌లు నిర్ణయాన్ని తీసుకున్నాయి.
ఇప్పటి వరకు వినియోగదారులంతా తమ కరెంట్ బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే సహాయంతో ఈజీగా చెల్లించేవారు. చివరకు పల్లెటూరిలో కూడా ఎవరో ఒకరి సాయంతో డిజిటల్ చెల్లింపులు చేసేవారు. అయితే వీరంతా కొత్త టీజీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ యాప్, వెబ్సైట్ ద్వారా చెల్లింపులు చేయాలన్న మార్పుకు అలవాటు పడలేక కొంత గందరగోళానికి గురవుతున్నారు.
దీంతో కరెంట్ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర ఒకప్పటిలా మళ్లీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపుల సస్పెన్షన్ వల్ల సీపీడీసీఎల్లో చెల్లింపుల బకాయిలు భారీగా పెరిగిపోయాయి. దీంతో వెనక్కి తగ్గిన అధికారులు ఫోన్ పే ద్వారా కూడా కరెంట్ చెల్లింపులు పునరుద్ధరించినట్లు తాజాగా ప్రకటించారు. ఒక్క ఫోన్ పేలో కాకుండా త్వరలో గూగుల్ పేలో కూడా కరెంటు బిల్లులు కట్టేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.