యూట్యూబ్ మరింత కఠినమైన రూల్స్‌ని తీసుకొచ్చింది. నిబంధనల ప్రకారం లేకపోతే మీ వీడియోని యూట్యూబ్ తొలగించే ప్రమాదం కూడా ఉంది. వీక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉండే క్లిక్ బైట్ వీడియోలపైన కఠినంగా వ్యవహరించనున్నట్టు యూట్యూబ్ తాజాగా ప్రకటించింది. తప్పుదోవ పట్టించే విధంగా ఉండే హెడ్లైన్స్, థంబ్ నెయిల్స్ తో కూడిన వీడియోలను తొలగిస్తామని భారతీయ కంటెంట్ క్రియేటర్స్ ని హెచ్చరించింది. ఈ మేరకు కఠినమైన నిబంధనలను అమలు చేసే ప్రణాళికలను కూడా ప్రకటించింది.
బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఈవెంట్ కి సంబంధించిన కంటెంట్‌ని నిశితంగా పరిశీలిస్తామని యూట్యూబ్ హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే శీర్షికలు, థంబ్ నెయిల్స్ ఉన్న వీడియోలను పూర్తిగా తొలగించేలా తాజా మార్పులు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటివాటిపై ఫోకస్ పెట్టిన యూట్యూబ్ ముందుగా మోసపూరిత శీర్షికలు లేదా థంబ్ నెయిల్స్ ఉన్న వీడియోలను తొలగిస్తుంది . అయితే క్రియేటర్ల ఛానళ్లకు స్ట్రైక్స్ జారీ చేయదు. అయితే బ్రేకింగ్ న్యూస్ లేదా కరెంట్ ఈవెంట్లకు సంబంధించి స్పష్టమైన విధానాలను కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. అంతేకాకుండా క్రియేటర్లు తమ వీడియోలను తొలగించడంపై ఎలా అప్పీల్ చేయవచ్చనే వివరాలను కూడా యూట్యూబ్ ఇంకా చెప్పలేదు.
లేటెస్ట్ గా అప్‌లోడ్ చేసిన వీడియోలపై యూట్యూబ్ దృష్టి పెడుతుంది. అయితే కొత్త నిబంధనలను ఉల్లంఘించే పాత కంటెంట్ కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. క్రియేటర్లు వారి మునుపటి అప్ లోడ్లను సమీక్షించమని, కొత్త విధానాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితమైన, సంబంధిత కంటెంట్ని అందించడానికి ..వీక్షకులు వారు చూసే వీడియోలపై ఆధారపడే మరింత నమ్మదగిన వాతావరణాన్ని పెంపొందించాలని యూట్యూబ్ భావిస్తోంది. కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రావడంతో, భారతీయ యూట్యూబ్ క్రియేటర్లు ఎలా స్పందిస్తారో, ఈ ప్రమాణాలకు అనుగుణంగా వారి కంటెంట్‌ని ఎలా సర్దుబాటు చేస్తారోననే చర్చ జోరుగా సాగుతోంది.