సంక్రాంతి పండుగ వస్తుందంటేనే హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అయిపోతుంది. సొంతూరు వెళ్లే ప్రయాణీకులతో బస్సులు, రైళ్లు , ప్రయివేట్ వాహనాలు నిండిపోతూ కనిపిస్తుంటే మరో వైపు బోసిపోయిన రోడ్లతో సిటీ వెలవెలబోతుంది.సంక్రాంతి కోసం అధికారులు ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా..ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వేసినా అవి కిటకిటలాడుతూనే ఉంటాయి. తాజాగా వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్తను సంక్రాంతి పండుగకు ముందే మోసుకువచ్చింది.
ఈరోజు నుంచి అంటే జనవరి 11 నుంచి విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేయబోతోంది దక్షిణ మధ్య రైల్వే. 20833-34 నెంబర్ గల విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రస్తుతం 16 కోచ్‌లతో 1,128 ప్యాసింజర్ల సామర్థ్యంతో సర్వీసు అందిస్తుంది. అయితే జనవరి 11న ఈ ట్రైన్ 1,414 ప్యాసింజర్ల సామర్థ్యంతో 20 కోచ్‌లతో పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం 16 కోచ్‌లు ఉన్న ఈ వందేభారత్ ట్రైన్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి.
ఈ ట్రైన్ 130 శాతం కంటే ఎక్కువ డిమాండ్‌తో నడుస్తూ ఉండటం.. ప్రయాణీకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో మరో 4 అదనపు కోచ్‌లతో పెంచడానికి అధికారులు నిర్ణయించకున్నారు. ఈ ట్రైన్‌ను 2025 జనవరి 11 నుంచి ప్రస్తుత 16 కోచ్‌లకి బదులు.. 20 కోచ్‌ల సామర్థ్యంతో నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఇప్పటి వరకూ 1,336 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 18 చైర్ కార్లు ఉండనుండగా.. 104 మంది ప్రయాణికులతో 02 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు కలిపి మొత్తం 20 కోచ్‌లలో 1,440 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుందన్న మాట.