తలనొప్పి వస్తే.. చిన్న చిన్న శబ్ధాలు కూడా భరించలేనంతగా అనిపిస్తాయి. అలసట, నిద్రలేమితో వచ్చిన తలనొప్పి ఓకే కానీ తరచూ ఇబ్బంది పెడతే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను కన్సల్ట్ అవ్వాల్సిందే. జలుబుతో వచ్చే తలనొప్పి చాలా సాధారణం. అయితే తరచూ వచ్చే హెడ్డేక్ ప్రాణాపాయంగా మారొచ్చు. కొన్ని లక్షణాలను బట్టి ఇలాంటి తలనొప్పిని గుర్తించవచ్చు. మొదటిసారి భరించరాని తలనొప్పి వచ్చినా, ఇప్పటి వరకూ ఇలాంటి తలనొప్పి రాలేదన్నంతగా వచ్చినా, రోజులు గడిచేకొద్దీ తలనొప్పి పెరిగినా.. వంగినపుడు, బరువులెత్తినపుడు, దగ్గినపుడు హెడ్డేక్ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. వెంటనే చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదంగా మారొచ్చు.
సాధారణంగా చాలా తలనొప్పుల్లో 70శాతం ఒత్తిడి వల్లే వస్తుంది. ఆందోళన , దిగులు వంటి మానసిక కారణాలతో ఇది వస్తుంది. ఇది విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. ఈ నొప్పి వల్ల ప్రాణాపాయం ఉండదు. తర్వాత ఎక్కువ మంది మైగ్రేన్ అనే పార్శ్వ నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఆకలి,నిద్ర లేకపోవడం, లైటింగ్, ఒత్తిడి, అతి నిద్ర, చాకోలెట్లు ఎక్కువ తినడం వంటి కారణాలతో ఈ నొప్పి వస్తుంది. ఇది ముఖానికి, తలకి ఒక వైపు ఉంటుంది ఈ నొప్పితో పాటు వికారం, వాంతులు, కళ్లు తిరగడం మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి కూడా విశ్రాంతి తీసుకుని సాధారణ నొప్పి మాత్రలు వేసుకుంటే తగ్గుతుంది. అలాగే కొంతమందిలో వ్యాయామం తర్వాత తలనొప్పి వస్తుంది. కానీ ఇది వెంటనే తగ్గిపోతుంది.
ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది. సాధారణ జలుబు నుంచి మెదడువాపు వ్యాధి వరకు కొన్ని వందల రకాల కారణాలు ఉంటాయి. అవి వైరస్, బాక్టీరియా, ఫంగల్ లేదా పారసైట్ ఇన్ఫెక్షన్లు ఏవైనా కావచ్చు. సైనసైటిస్ ఉన్నవారిలోనూ తరచూ హెడ్డేక్ వస్తుంది. ఆ తర్వాతి వరసలో తలకి గాయం వలన వచ్చే తలనొప్పి, అలాగే రక్తనాళాల సమస్యల వలన వచ్చే తలనొప్పులు అరుదు అయినా ఇవి ప్రమాదకరం. అయితే మెదడులో కణుతుల వలన కూడా తలనొప్పి వస్తుంది.
ఈ తలనొప్పి రాగానే క్యాన్సర్ వచ్చేసింది అనుకొని కంగారు పడిపోకూడదు. వెంటనే డాక్టర్ ను కలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏ వ్యాధి అయినా ప్రారంభంలోనే చూసుకుంటే ప్రాణాపాయం ఉండదు. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాతో స్కానింగ్ చేయించుకుంటే సరిపోతుంది. కేవలం స్కానింగ్ వల్ల అది ఎలాంటి తలనొప్పో తెలియదు. కొన్నిసార్లు వెన్ను నీరు తీసి కూడా పరీక్షించాల్సి ఉంటుంది.
మందుల వాడకంలో కూడా జాగ్రత్త వహించాలి. అధికంగా మందులు తీసుకోవడం వలన తలనొప్పి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. వీటి వల్ల కడుపులో పుండ్లు రావడం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. తలనొప్పి రాకుండా కొన్ని మందులు ఉంటాయి, అవి వైద్యుడి సలహా మేరకు క్రమం తప్పక వాడాలి. దీంతో పాటు డైలీ మంచి నిద్ర, వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. ఆల్కహాల్, స్కోకింగ్ అలవాట్లు ఉంటే వెంటనే వాటికి గుడ్‌బై చెప్పాలి.