టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా రోజుకో కొత్తరకం డిజిటల్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు రకరకాల కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఫేక్ ఐవిఆర్ కాల్స్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని లేకపోతే మీకు తెలీకుండానే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుందని అంటున్నారు టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్.
టెక్నాలజీ ఎంతగా వృద్ధి చెందుతుంతో డిజిటల్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, పెద్దవాళ్లను టార్గెట్ చేస్తూ వారి అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు స్కామర్లు. టెక్నాలజీ ద్వారా ప్రజలను మోసం చేయడానికి సరికొత్త ప్లాన్ లు వేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా చాలా చోట్ల IVR ద్వారా మోసం కేసులు వెలుగులోకి వచ్చినట్లు సైబర్ పోలీసులు చెబుతున్నారు.
ఐవీఆర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కోట్లు కాజేస్తున్నారు. ఐవీఆర్ అనేది బ్యాంకులు, టెలికాం కంపెనీలు, కస్టమర్ కేర్ కోసం సంస్థల హెల్ప్‌లైన్‌లు ఉపయోగించే ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్. దీనిలో ఫోన్ కీప్యాడ్ లేదా వాయిస్ ద్వారా “ఇంగ్లీష్ కోసం 1 నొక్కండి, బ్యాలెన్స్ తెలుసుకోవడానికి 3 నొక్కండి, కస్టమర్ కేర్‌తో మాట్లాడటానికి 9 నొక్కండి వంటి ఆదేశాలను ఇస్తారు. వాటి ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకోవచ్చు.
ఈ ఐవీఆర్ వ్యవస్థనే స్కామర్లు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఎవరికైనా ఐవీఆర్ కాల్ వచ్చినప్పుడు వారు చెప్పిన కీని నొక్కితే వెంటనే స్కామర్లు ఖాతాను ఖాళీ చేస్తారు.అందుకే ఇలాంటివాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని.. నమ్మదగిన ఐవీఆర్ కాల్స్ కు మాత్రమే ఆన్సర్ చేయాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు.