నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. చలిభయంతో బయటకు వెళ్లాలంటేనే చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఈ తీవ్రమైన చలితో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా చలి గాలులకు ఈ పదేళ్లలో 800 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరిత పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న చలితో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
చలి పెరిగిందని ఇంట్లో కర్రలు, బొగ్గుల కుంపటి వంటివి వెలగించవద్దని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్, ఫ్లూ వంటివి వచ్చే అవకాశాలు ఉండటంతో ఎప్పటికప్పుడు చలినుంచి కాపాడుకోవాడానికి, ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.