అర్థరాత్రి ఆకలేస్తే వెంటనే గుర్తొచ్చే మ్యాగీ నూడుల్స్ ఇప్పుడు మరింత ఖరీదుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 1, 2025 నుండి ఈ మార్పు అమలులోకి రావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ప్రధాన కారణం భారతదేశం-స్విట్జర్లాండ్ మధ్య డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) లో మోస్ట్-ఫేవర్డ్-నేషన్ (MFN) నిబంధనను తాత్కాలికంగా నిలిపివేయాలని స్విట్జర్లాండ్ తీసుకున్న నిర్ణయం.
పన్ను వివాదం అసలు కారణం
1994లో కుదిరిన DTAA ఒప్పందం ప్రకారం, స్విస్ కంపెనీలు భారతీయ ఆదాయం నుండి పొందే డివిడెండ్లపై 5% పన్ను మాత్రమే చెల్లించాల్సివచ్చేది. కానీ స్విట్జర్లాండ్ ఇప్పుడు ఈ MFN నిబంధనను తాత్కాలికంగా నిలిపివేస్తోంది. ఫలితంగా స్విస్ కంపెనీలు, ముఖ్యంగా నెస్లే, భారత మార్కెట్ నుంచి పొందే డివిడెండ్లపై 10% పన్ను చెల్లించాల్సి వస్తోంది.
ఈ వివాదానికి మూలం భారత సుప్రీంకోర్టు 2023లో ఇచ్చిన తీర్పు. కోర్టు స్పష్టంగా పేర్కొంది MFN నిబంధన అమలు చేయబడదని, భారత ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని. ఈ తీర్పు ఆధారంగా స్విట్జర్లాండ్ కొత్త చర్య తీసుకుంది.
నెస్లే, భారత మార్కెట్‌లో మ్యాగీ, పాల ఉత్పత్తులు, ఇతర ఫుడ్ ప్రొడక్ట్స్ తో అధిక ప్రాధాన్యం కలిగిన కంపెనీ. పెరిగిన పన్ను భారాన్ని మోయలేక కంపెనీ వినియోగదారులపై దీని ప్రభావం చూపనుంది. ఇప్పటికే నెస్లే 2022లో మ్యాగీ ధరను రూ.2 పెంచింది. ఇప్పుడు పన్ను రేటు 5% నుండి 10%కు పెరిగితే, మరిన్ని ధరలు పెరగడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.
భారత వినియోగదారులపై ప్రభావం
పన్ను రేటు పెరగడంతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను సర్దుబాటు చేయవలసి వస్తుంది. స్విట్జర్లాండ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానంగా నెస్లే వంటి కంపెనీలపై ప్రభావం చూపించి, దీని లాభాలను తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
స్విట్జర్లాండ్ తన నిర్ణయాన్ని నిలబెట్టుకుంటే, 2025 జనవరి నుంచి భారత వినియోగదారులు మ్యాగీ సహా ఇతర స్విస్ ఉత్పత్తులను అధిక ధరలకు కొనాల్సి ఉంటుంది. DTAAలో MFN నిబంధన తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా స్విస్ కంపెనీలు ఇక ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే అవకాశం ఉంది.