ఇప్పుడు ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ, చివరకు జర్నీల్లో కూడా ఏసీల్లోనే గడిపేస్తున్నారు. ప్రకృతిలో కేటాయించటానికి సమయమే దొరకట్లేదు. అయితే ప్రకృతి వల్ల ఎన్నో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రకృతి వల్ల ఆస్తమా స్థాయిలు తగ్గుతాయని ఎన్నో పరిశోధనలలో నిరూపించబడింది. వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల ఆస్తమా స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. కానీ ప్రకృతిలో ఉండే చెట్లు .. మన చుట్టూ ఉన్న వాతావరణంలోని కాలుష్యాన్ని వడపోసి, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అడవుల ప్రాంతాలు లేదా ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జీవించే చిన్న పిల్లలతో పోలిస్తే, పట్టణాలలో జీవించే పిల్లలు ఎక్కువగా ఆస్తమా వ్యాధికి గురవుతారని కొన్ని పరిశోధనలలో వెల్లడయింది.
ఏ రకమైన వ్యాయామాలైన ఆరోగ్యకరమే అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాయామాలను ఇరుకుగా ఉన్న ఇంట్లో కన్నా, చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో చేయటం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చని చెట్ల మధ్య వ్యాయామాలు చేస్తే రక్త పీడనం తగ్గుతుందని, ఆత్మవిశ్వాసంతో పాటు మానసికంగా మంచి ఫలితాలను పొందుతారని పరిశోధనలలో తేల్చారు.
అంతేకాదు రోజులో కొంత సమయాన్ని ప్రకృతిలో తిరగటం లేదా కాస్త సమయాన్ని పార్కులు వంటి దగ్గర గడపటానికి కేటాయించటం వల్ల డిప్రెషన్ వంటి లక్షణాలు తొలిగిపోతాయి. పచ్చని చెట్లు, గలగలపారే సెలయేళ్లు, ఎత్తైన కొండలు, ఎగిసిపడే అలలు వంటివి చూస్తుంటే మూడ్ కూడా మారుతుందని తేలింది. పార్క్ లు లేదా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జీవించే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రకృతిలో సమయం కేటాయించటం వలన మానసిక అలసట తగ్గడంతో.. మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి మెరుగుపడటమే కాకుండా కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుందట. అందుకే పట్టణాలలో తిరిగే వారితో పోలిస్తే, చెట్లు ఉన్న ప్రాంతంలో కేవలం 30 నిమిషాల పాటూ తిరిగే వారిలో జ్ఞాపకశక్తితో పాటు.. మెదడు యొక్క పనితీరు బాగుంటుందని పరిశోధనలలో తేలింది.
చాలా కాలం నుంచి అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారిని కూడా రోజు కొద్ది సమయం పాటూ చల్లగాలికి బయట ఉన్న చెట్లు, పార్కుల మధ్య తిప్పటం వల్ల ఈ వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. ఇంకా వ్యాధి తీవ్రతలు కూడా బాగా తగ్గాయని ఒక పరిశోధనలో తేలింది. అందుకే వీలయినంత ప్రతిఒక్కరూ పచ్చని చెట్లు, సెలయేళ్లు ఉన్నచోట రోజుకు అరగంట అయినా ఉండాలని. వీలయినపుడల్లా ప్రకృతిని ఆస్వాదించే విధంగా టూర్లు ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.