భారతదేశంలో 2016లో మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేసిన తర్వాత..ట్రాన్జాక్షన్లను ఈజీ చేయడానికి ఎన్పీసీఐ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదట్లో మందకొడిగా ఉన్నఈ యూపీఐ పేమెంట్లు తర్వాత బాగా పెరిగి ఏ ఏడాదికి ఆ ఏడాది నయా రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అలా గత డిసెంబర్లో యూపీఐ పేమెంట్లు ఆల్‌టైమ్ హైకి చేరి కొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
నిజానికి డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రపంచ దేశాలకు భారతీయులు గట్టి పోటీనిస్తున్నట్లే చెప్పొచ్చు. అలా 2024 డిసెంబర్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్జాక్షన్స్ సంఖ్య రికార్డు స్థాయిలో 16.73 బిలియన్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ..తాజాగా వెల్లడించింది. అలాగే నవంబర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 15.48 బిలియన్లుగా ఉన్నట్లు తెలిపింది.
లావాదేవీల ఎక్కువ సార్లు చేయడంతో పాటు యూపీఐ లావాదేవీల విలువ కూడా పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. విలువ పరంగా నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 8 శాతం పెరుగుదలను యూపీఐ నమోదు చేసింది. నవంబర్‌లో మొత్తం యూపీఐ లావాదేవీల విలువ 21.55 లక్షల కోట్ల రూపాయలు కాగా డిసెంబర్లో 23.25 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
మొత్తం 2024 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 2023లో 118 బిలియన్లుగా ఉన్నయూపీఐ ట్రాన్జాక్షన్ల సంఖ్య భారీగా 46 శాతం పెరిగి 2024లో 172 బిలియన్లకు చేరుకుంది. విలువ పరంగా కూడా 2023తో పోలిస్తే 2024లో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2024లో యూపీఐ ద్వారా రూ.247 లక్షల కోట్ల ట్రాన్జాక్షన్లు జరగ్గా 2023లో నమోదైన విలువ రూ.183 లక్షల కోట్లుగా ఉంది.
ఇతర చెల్లింపుల విషయానికి వస్తే ఐఎంపీఎస్ ట్రాన్జాక్షన్లు డిసెంబర్ 2024లో 8 శాతం పెరిగాయి. అలాగే నవంబర్‌లో 40.8 కోట్లు, 2024 అక్టోబర్‌లో 46.7 కోట్లతో పోలిస్తే 44.1 కోట్లు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే డిసెంబర్లో ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీల పరిమాణంలో.. 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే ఒక్క డిసెంబర్ నెలలోనే లావాదేవీల విలువ రూ.38.2 కోట్లకు చేరుకుందన్న మాట. నవంబర్‌లో గణాంకాలు రూ.35.9 కోట్లుగా ఉండగా, అక్టోబర్‌లో రూ.34.5 కోట్లుగా ఉంది.