ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు మరొక కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రావడానికి మార్గం సుగమమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు విపరీతమైన ఆదరణతో, ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రారంభించిన విశాఖపట్నం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, అలాగే విజయవాడ-చెన్నై వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల స్పందన అద్భుతంగా ఉంది.
ఈ కోవలోనే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా బెంగళూరుకు కొత్త వందేభారత్ రైలు కోసం రైల్వే శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రూట్ గురించి ప్రాథమిక వివరాలు ఖరారు అయ్యాయి, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు సర్వీసు డిమాండ్
తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం బెంగళూరుకు కొత్త వందేభారత్ అవసరం గురించి చర్చలు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం గుంటూరు-బెంగళూరు రైలు ప్రయాణానికి 16 గంటల సమయం పడుతోందని, ఇది ప్రయాణికుల బడ్జెట్, సమయం పరంగా అనుకూలంగా లేదని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు రైల్వే మంత్రితో పార్లమెంట్‌లో ప్రస్తావించారు.
వందేభారత్ రైలు ప్రవేశిస్తే, సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
రూట్ వివరాలు
గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం మీదుగా నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక స్టేషన్లతో కొత్త వందేభారత్ నడపాలని ప్రతిపాదించారు. రైల్వే అధికారులు సాంకేతిక అంశాలపై నివేదిక సిద్ధం చేసి, పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరులోపుగా కొత్త రైలు పైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త రైలు ప్రవేశంతో, తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరుకు ప్రయాణం వేగవంతం కావడమే కాకుండా, ప్రయాణికుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. ఇది రైల్వే రంగంలో మరో కీలక ముందడుగుగా నిలిచే అవకాశముంది.