తెలంగాణ విద్యుత్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ రాబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలైన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) మరియు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TNSPDCL)ల్లో మొత్తం 3,500 జూనియర్ లైన్‌మెన్ (Junior Lineman – JLM) తదితర పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
TGSPDCLలో ఖాళీలు:
TGSPDCLలో 1,550 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉండగా, హైదరాబాద్ పరిధిలో 550 పోస్టులు ఉన్నాయి. గత నియామక నోటిఫికేషన్‌లో అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండటంతో హైదరాబాద్ నగర పరిధిలో 200 పోస్టులు మిగిలిపోయాయి. ఈసారి మొత్తం ఖాళీలను కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మహిళలకు కూడా అవకాశం:
జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఈసారి మహిళలు కూడా అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళలు కూడా పోటీలోకి రావచ్చు. నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు కూడా భర్తీ:
జేఎల్ఎం పోస్టులతో పాటు TGSPDCLలో 50 అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులను కూడా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ఉంది.
వర్గీకరణపై స్పష్టత అనంతరం నోటిఫికేషన్:
నవంబర్‌లోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిస్కంలు భావిస్తున్నా, ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ ఆర్టీసీ భర్తీలు:
విద్యుత్ శాఖతో పాటు, తెలంగాణ ఆర్టీసీ సంస్థలో కూడా 3,035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 2,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఉపాధ్యాయ నియామకాలపై కీలక నిర్ణయాలు:
ఉపాధ్యాయ నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసిన రేవంత్ సర్కార్, తాజాగా టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
ఈ నియామక ప్రక్రియలన్నీ త్వరలోనే మొదలవుతాయని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. విద్యుత్, ఆర్టీసీ, ఉపాధ్యాయ నియామకాలతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి.