భారతదేశంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ఇటీవల ఆర్‌బీఐ (RBI) కొత్త నిబంధనల పేరుతో సోషల్ మీడియాలో ఒక వైరల్ పోస్ట్ కలకలం రేపింది. ఈ పోస్ట్ ప్రకారం, రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులు, సామాన్య ప్రజలలో గందరగోళం నెలకొంది. ఈ వార్తలో నిజమెంత? అసలు RBI ఏమైనా కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయంటూ ప్రచారం జరిగింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
PIB ఫ్యాక్ట్ చెక్
PIB ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తను పరిశీలించి దీనిలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. RBI ఇప్పటివరకు రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలపై జరిమానా విధించేలా ఏ సర్క్యులర్ లేదా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ వార్త పూర్తిగా అబద్దం అని PIB ప్రకటించింది.
భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరవవచ్చో అనే విషయంలో ఎటువంటి పరిమితి లేదు. అవసరాన్ని బట్టి మీరు బహుళ బ్యాంక్ ఖాతాలు తెరవవచ్చు. అయితే, ప్రతి బ్యాంకు నిబంధనల ప్రకారం, ఖాతాలో కనీస మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే బ్యాంకులు మాత్రమే పెనాల్టీ విధిస్తాయి.
సోషల్ మీడియాలో వచ్చే వైరల్ వార్తలపై వెంటనే నమ్మడం తప్పు. RBI పేరు మీద వచ్చిన ఏవైనా సందేహాస్పద వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ లేదా ఆధికారిక వెబ్‌సైట్ ద్వారా క్లారిటీ తీసుకోవాలి.