సమ్మర్ వచ్చేసింది. పిల్లలకు హాలీడేస్ వచ్చేస్తున్నాయి. దీంతో ఎక్కడికి వెళ్లాలన్న ఆలోచనలో చాలామంది ఉంటారు.దీనికోసం వీసాతో ఏ మాత్రం పనిలేని శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అందాలు కొలువున్న దేశంగా గుర్తింపబడ్డ శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. దేశ జీడీపీలో 10 శాతం వాటా శ్రీలంకదే అంటే పర్యాటక రంగంలో శ్రీలంక పాత్రను అర్ధం చేసుకోవచ్చు.
అయితే కరోనా మహమ్మారి రాక ముందు లంక పర్యాటక ఆదాయం 360 కోట్ల డాలర్లు ఉండగా.. దాని తర్వాత బాగా పడిపోయింది. ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. 2019 నాటి కరోనా వైరస్ సంక్షోభానికి శ్రీలంక పర్యాటక రంగం మొత్తం కుదేలైంది. దానికి తోడు ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో శ్రీలంక మొత్తం సంక్షోభంలోకి జారిపోవడంతో.. ఆ దేశానికి పర్యాటకుల రాక మెల్లగా తగ్గిపోయింది.
ప్రతి ఏడాది శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్‌కు చెందినవారే ఉంటారు. అయితే అక్కడ యుద్ధం ఇంకా శాంతించకపోవడం వల్ల ఇప్పుడు అక్కడి టూరిస్టులు వచ్చే పరిస్థితి లేదు. దీనివల్ల శ్రీలంక ఆదాయానికి మరింతగా గండిపడింది. దీంతో ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి నడుం కట్టిన శ్రీలంక ప్రస్తుతం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
దీంతో 2023 సంవత్సరానికి 20 లక్షల మందిని ..2024 మార్చికి కోటికి పైగా టూరిస్టులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఫ్రీ వీసా పాలసీని తీసుకొచ్చింది. 2023 సెప్టెంబర్లో 10 లక్షల మందికి పైగా టూరిస్టులు శ్రీలంకకు వెళ్లారు. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో టూరిస్టులు రావడం ఇదే తొలిసారి. ఇంకా చెప్పాలంటే శ్రీలంకలో ఇప్పుడు పరిస్థితులు కాస్త బాగానే మెరుగుపడుతున్నాయి ఈ అవకాశాన్ని వదులుకోకుండా మరింత పెంచడానికి శ్రీలంక ప్రభుత్వం ఫ్రీ వీసా పాలసీకి శ్రీకారం చుట్టింది.
భారతదేశంతో పాటు మరో 6 దేశాల పౌరులకు వీసా లేకుండానే.. శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అనుమతివ్వాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత్, రష్యా, చైనా, జపాన్, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు జారీ చేయడానికి శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది.అందుకే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవతలు కొలువుండే ప్రాంతంగా పిలుచుకునే శ్రీలంకను ఓసారి చుట్టేసి రండి.