ప్రస్తుతం ఓటీటీ రంగంలో ప్రైవేటు కంపెనీల హవా కొనసాగుతోంది. దేశంలో దాదాపు 78 ఓటీటీ సర్వీసులు ఉండగా, వాటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు సామాన్యులకు అందని రీతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల కోసం ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈనెల 20న ప్రసార భారతి ఓటీటీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికగా ప్రసార భారతి ఓటీటీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
దూరదర్శన్ ఫ్రీ డిష్‌లో అందుబాటులో ఉన్న 60 టీవీ ఛానళ్లు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారం కాబోతున్నాయి. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో కేవలం లైవ్ టీవీ ఛానళ్లు మాత్రమే కాకుండా, గతంలో ప్రజాదరణ పొందిన సినిమాలు, హిట్ ప్రోగ్రామ్స్ వంటి అనేక విధాలైన కంటెంట్ కూడా అందుబాటులోకి రానుంది. ప్రసార భారతి ఓటీటీ సర్వీస్‌ను ‘ఫ్యామిలీ ఫ్రెండ్లీ’గా రూపొందించి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
ఈ సేవ ద్వారా వినియోగదారులు 4కే రెజల్యూషన్‌లో వీడియో-ఆన్-డిమాండ్ (VoD) సేవలను పొందగలరు. అలానే షోలు, క్రికెట్ టోర్నమెంట్‌లు, ప్యాకేజీలు వంటి వివిధ కంటెంట్‌ను కొనేందుకు కార్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రారంభంలో కంటెంట్‌ను కొంతకాలం వరకు ఉచితంగా అందించాలని ప్రసార భారతి భావిస్తోంది. కంటెంట్ అభివృద్ధి కోసం ప్రసార భారతి ప్రముఖ కంటెంట్ సృష్టికర్తలు విపుల్ షా, కబీర్ బేడీతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
ఇక ప్రసార భారతి ఓటీటీతో పాటుగా, దేశంలోని వీడియో గేమింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ద్వారా గేమింగ్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, ఈ రంగంలో భారత్ ఆధిపత్యం సాధించడానికి ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
అలాగే 2025 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ గురించి ప్రస్తావిస్తూ, ఈ సమ్మిట్ భారత యువత ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుందని, పెట్టుబడిదారులను ఆకర్షించే వేదికగా నిలుస్తుందని జాజు తెలిపారు. ఇదే కాకుండా, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ త్వరలో లక్షలోపు జనాభా కలిగిన పట్టణాల్లో 237 స్థానిక ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో చానళ్లను వేలం వేయనుంది.