సాధారణంగా మేళాలలో, పెద్ద పెద్ద పండుగలలో,తిరునాళ్లలో, స్వామి మాల.. భవానీ మాల దీక్షా విరమణ వంటి సమయాలలో చిన్నపిల్లలు తప్పిపోతుంటారు. తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అయి పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా చాలా సమయాలలో మిస్సింగ్ కేసులుగా ఇవి మిగిలిపోతుంటాయి. వీటికి చెక్ పెట్టడానికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ టెక్నాలజీని ఎంటర్ చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చొరవతో ఈసారి భవానీ దీక్షా విరమణల్లో ప్రవేశపెట్టిన సీఎంఎస్.. అంటే చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ క్యూఆర్ కోడ్ చైల్డ్ ట్యాగ్ అద్భుత ఫలితాలిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ అయిదు రోజుల్లో తప్పిపోయిన మొత్తం పదిమంది చిన్నారులను ఈ టెక్నాలజీ సహాయంతోనే తల్లిదండ్రులు చెంతకు క్షేమంగా చేర్చామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భవానీ దీక్షా విరమణల సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే ఎనిమిదేళ్లలోపు పిల్లల చేతికి..ఇప్పుడు జిల్లా యంత్రాంగం క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లను వేస్తోంది. ఐసీడీఎస్ విభాగం నుంచి సుమారు 60 బృందాలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, సిటీ ఎంట్రీ పాయింట్లు, క్యూలైన్లతో పాటు వివిధ ప్రదేశాలలో చిన్నారులకు ఈ క్యూఆర్ కోడ్ రెస్ట్ బ్యాండ్‌ను ఏర్పాటు చేశారు.
ఇలా బ్యాండ్‌ను చేతికి కట్టే సమయంలో మొబైల్ నంబర్‌తో పాటు ఆ పిల్లలు, తల్లిదండ్రుల వివరాలను కూడా క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేసి సర్వర్‌లో సేవ్ చేస్తారు. ఒకవేళ ఆ చిన్నారులు తప్పిపోయినట్లయితే, ఆ పిల్లలను గమనించిన వారు ఎవరైనా సరే వారిచేతికి ఉన్న ట్యాగ్‌పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ చిన్నారుల పేరు, తల్లిదండ్రుల పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి.
అంతేకాకుండా తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి లేదా వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించడానికి ఆప్షన్లు కూడా ఉంటాయి. దీంతో వారి తల్లిదండ్రులకు కాల్ చేసి వెంటనే ఆ చిన్నారులను అప్పగించొచ్చు. ఈసారి భవానీ మాల కార్యక్రమంలో ఇప్పటి వరకూ 12,000 మంది పిల్లలను ట్యాగ్ చేశారు. అయితే వీరిలో 10 మంది చిన్నారులు తప్పిపోగా.. ఈ ట్యాగ్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.