పుట్టుక, చావు మన చేతుల్లో ఉండవని.. మనముందున్న క్షణమే జీవితం అని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. నిజానికి చావు గురించిన రహస్యాలు ఎవరికీ తెలియవు. మరణించాక ఎలా ఉంటారు? బాడీ పని చేయకపోతే.. ఆలోచనలు కొనసాగుతాయా? పురాణాల్లో చెప్పినట్లు శరీరం, ఆత్మ సెపరేట్‌గా ఉంటాయా? ఇలా ఎన్నెన్నో రహస్యాలు అంతుచిక్కకుండానే ఉన్నాయి.
అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు చావు గురించి గుట్టును ఒక్కొక్కటిగా విప్పుతున్నాయి. త్వరలోనే చావు రహస్యాలన్నిటినీ బట్టబయలు చేసేలా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం.. ప్రాణం, మరణానికి మధ్య మరో దశ ఉంటుందని.. అదే థర్డ్ స్టేట్ అని తేలింది.
చనిపోయిన శరీరంలోని ఓ అవయవం నుంచి తీసుకున్న కణాలు.. ఒక మల్టీసెల్యూలర్‌గా ఏర్పడి జీవం పోసుకుంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఇప్పటి వరకున్న ప్రాణం, చావు అవగాహనకు భిన్నంగా కణాల ప్రవర్తనకు సంబంధించి సరికొత్త వివరాలను బయటపెట్టింది.
అవయవాలు పని చేయలేని స్థితిని చావు అని అంటారు. కానీ, అవయవ దానం చేసినప్పుడు.. అందులోని కణాలు సదరు జీవి మరణం తర్వాత కూడా పని చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. మనిషి చనిపోయాక కూడా కణాలు ఎలా పని చేస్తాయి? ఏ మెకానిజం వాటిని అలా పని చేయనిస్తున్నాయి వంటే ఆసక్తికర ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు సైంటిస్టులు వీటి గురించే పరిశోధిస్తున్నారు.
వీరి తాజా పరిశోధనల ప్రకారం.. సరైన పద్ధతుల్లో కణాలను భద్రపరిచినప్పుడు అవి కొత్త జీవాన్ని పోసుకుంటున్నాయని తేలింది. ఈ కణాలకు పోషకాలు, ఆక్సిజన్ లేదా బయో ఎలక్ట్రిసిటీ అందించినప్పుడు అవి మల్టిసెల్యూలర్ స్ట్రక్చర్‌గా ఎదుగుతాయని పరిశోధనలు తెలిపాయి. అంతేకాదు ఆ కణాలు గతంలో తమ సజీవ శరీరంలో ఉన్నప్పుడు చేయని పనలను కూడా ఇలా మల్టిసెల్యూలర్‌గా ఏర్పడ్డాక చేస్తాయని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు.
ఉదాహరణకు.. చనిపోయిన కప్ప చర్మ కణాలను తీసి ల్యాబ్‌లో భద్రపరచగా.. ఆ కణాలు జెనోబాట్స్ అనే బహుళ కణ జీవిగా రూపాంతరం చెందుతునట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కప్ప సజీవంగా ఉన్నప్పుడు సిలియాను స్రావాలను పంప్ చేయడానికి ఉపయోగపడేది. కానీ, అదే కప్ప కణాలు జెనోబాట్‌గా మారాక నేవిగేషన్ కోసం ఉపయోగపడుతుందని తేల్చారు.
అదేవిధంగా మనిషి ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలను కూడా.. ల్యాబ్‌లో సరైన కండిషన్స్‌లో భద్రపరిస్తే.. అవి సొంతంగా ఒక సూక్ష్మ రూపాన్ని సంతరించుకోవడమే కాకుండా.. దానంతట అది కదిలేంత శక్తి లేదా సొంతంగా రిపేర్ చేసుకునే సామర్థ్యాన్ని పొందింది.
అయితే,ఈ కణాల మనుగడను పరిశోధించిన క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటి చుట్టూ ఉండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని గమనించారు. మెటబాలిక్ యాక్టివిటీ, భద్రపరిచే విధానంపైన కూడా అది ఆధారపడి ఉంటుందని తేల్చారు. ఉదాహరణకు ఒక మనిషి చనిపోయాక 60 గంటల తర్వాత అతనిలో ఉన్న తెల్ల రక్తకణాలన్నీ చనిపోతాయి. అదే ఎలుక అస్థిపంజర కణాలు 14 రోజుల పాటు మరణించవని పరిశోధనలు చెబుతున్నాయి.
క్రయోప్రిజర్వేషన్ వంటి టెక్నిక్ ఉపయోగిస్తే.. ఎముక మజ్జ సజీవంగా ఉన్నా కూడా కణాల్లాగే ఉండగలదని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ కణాల మనుగడ, దాని వెనుక ఉన్న మెకానిజాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకుంటే మరెన్నో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా విషయాలపై ఇంకా సందిగ్దతే ఉన్నా కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు జీవం, మరణం వెనుక గల రహస్యాలను ఛేదించే దిశగా సాగుతున్నాయి.