కుక్కలు ఏడిస్తే ఆ వీధిలోనో.. లేదా వారి బంధువులు, స్నేహితుల్లో ఎవరైనా చనిపోతారనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని వెతికితే మాత్రం విశ్వాసాల ఆధారంగా ఏమీ కనిపించదు. దీనికి ఎలాంటి సమాధానం లభించదు. నిజానికి అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలిస్తే మాత్రం ఎవరూ భయపడరని యానిమల్ డాక్టర్లు చెబుతున్నారు.
నిజానికి యానిమల్స్లో ముఖ్యంగా కుక్కలు చలికాలంలో ఎక్కువగా ఏడుస్తుంటాయని ..ఎందుకంటే అవి చలికి తట్టుకోలేక ఏడుస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలా హృదయవిదారకంగా అరవడం మిగిలిన కుక్కలకు సందేశాలను పంపడం కూడా ఇంకొక కారణం కావచ్చని అంటున్నారు.అయితే కుక్కలు రాత్రిపూట తమ చుట్టూ ఎక్కడైనా ఆత్మలు కనిపిస్తే ఏడుస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇంట్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు ఏడిస్తే..అశుభం అని చాలా మంది నమ్ముతుంటారు. నిజానికి కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని కూడా నమ్ముతారు. అంతేకాదు మనుషులు చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కుక్కలు చూడగలుగుతాయని అంటుంటారు.
మనుషుల్లాగే కుక్కలు కూడా భావోద్వేగాలను కలిగి ఉంటాయి. వాటికి కలిగే బాధ, కోపం, ఆవేదన, ఆందోళనను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. ఇలా తమ ఉద్యేగాలను బయటపెట్టడానికే అవి ఏడుస్తుంటాయని యానిమల్ డాక్టర్స్ చెబుతున్నారు. అయితే ఒకవేళ పగటిపూట కుక్కకు గాయమయితే ఉదయం ఏడ్వాలి కానీ రాత్రి పూట మాత్రమే ఎందుకు ఏడుస్తాయని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజానికి దెబ్బ తగిలితే చలికి రాత్రి కుక్కకు తగిలిన నొప్పి పెరుగుతుంది. దాంతోనే అది నొప్పిని భరించలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తుందని అంటున్నారు. కేవలం దెబ్బల వల్లే కాదు.. కుక్కలు బాగా ఆకలితో ఉన్నప్పుడు కూడా ఏడుస్తాయి.
అంతేకాదు శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వాటికి తినడానికి ఏమీ దొరకవు. అందుకే కుక్కలకు తినడానికి ఏమీ దొరకలేనప్పుడు..అవి ఆకలితో ఏడుస్తాయి. అంతేగానీ, కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారన్న మాటల వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగినట్లు పెద్దలు కొన్ని ఉదాహరణలు చెప్పినా కూడా అది కేవలం యాధృచ్ఛికం మాత్రమేని అంటున్నారు.కొన్నిసార్లు తమ పిల్లలు, లేదా తల్లి దూరమైనప్పుడు కూడా కుక్కలు ఏడుస్తుంటాయి. వీధి కుక్కలను వాటి గుంపు నుంచి కొన్ని కుక్కలను వేరు చేసినప్పుడు, లేదంటే పెంపుడు కుక్క దాని యజమాని నుంచి వేరైనప్పుడు రాత్రిపూట బిగ్గరగా అరవడం, ఏడవడం చేస్తాయి. వయస్సు పెరగడం వల్ల కూడా కుక్కలు ఏడుస్తుంటాయి. అంతేకాదు తాను ఒంటరిగా ఉన్నానంటూ తన ఆవేదనను మిగిలిన కుక్కలకు తెలియజేయడానికి కూడా కుక్కలు ఏడుస్తుంటాయట.