కామాఖ్య దేవి దేవాలయ ప్రత్యేకత తెలుసా?

అష్టాదశ శక్తి పీఠాలు చాలా ప్రాముఖ్యమని మనకందరికీ తెలిసిందే. పార్వతీ దేవి ఒక్కో భాగం పడిన చోటునే ఆ శక్తి పీఠాలు వెలసిన దేవాలయాలుగా భక్తులతో పూజలు అందుకుంటున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటైన కామాఖ్య దేవి దేవాలయం విశిష్టమైనది. అస్సాంలో అమ్మవారి యోని భాగం పడిన చోటు అయిన కామాఖ్య దేవాలయంలో భక్తుల కోరిన కోర్కెలు తీరతాయని అందరి నమ్మకం.

పురాణాల ప్రకారం శివుడు విగతజీవిగా మారిన తన భార్య సతీదేవిని భుజం పైన వేసుకొని లోకం మొత్తం తిరుగుతుంటాడు. ఇది చూసిన విష్ణువు.. మహాశివుడు అలా తిరిగితే లోకం ఎలా నడుస్తుందని అనుకొని ఆమె దేహాన్ని విష్ణు చక్రంతో ముక్కలు చేస్తాడు. అలా ఆ ముక్కలు భూమిపై పడిన ప్రదేశాలన్నీ అష్టా దశ శక్తిపీఠాలుగా మారుతాయ్.ఆ విధంగా శివుడి భార్య సతీదేవి యోని భాగం అస్సాంలోని నేలాచల పర్వతంపై పడుతుంది.

ఇక్కడ వెలసిన దేవి కామారూపినిగా పిలుస్తారు. కామాఖ్య అమ్మవారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అమాయకులను హింసించే వారిని అంతం చేసే త్రిపుర భైరవిగా, అనంద రూపంలో పరమేశ్వరిగా, త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. కామాఖ్య దేవి ఆలయంలో త్రిపుర శక్తిదాయినిగా కూడా కొలుస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి కాకుండా సతీదేవి యోనికి పూజలు చేస్తారు.

కామాఖ్య అమ్మవారికి విచిత్రంగా నెలలో మూడు సార్లు రుతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారి రాతి యోనిలోంచి ఎర్రటి పదార్దం ద్రవిస్తుంది. ఈ సమయంలో కామాఖ్య ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఆ మూడు రోజులు ముగిసిన తరువాత నాలుగవ రోజు పూజలు చేసాక పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటారు.