కొన్ని నెలలుగా రన్నింగ్ రేస్ చేస్తున్న పసిడి ఈ మధ్య కాస్త బ్రేకులు పడి.. హమ్మయ్య బంగారం ధరలు దిగొచ్చాయి అనుకునేలోపే.. మళ్లీ రేట్లు పెరిగి ఒక్కసారిగా ఆల్ టైమ్ హైకి చేరాయి. ఏకంగా లక్ష రూపాయలకు చేరువ అవడంతో సామాన్యులు షాక్ తింటున్నారు. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 96వేల 540 రూపాయలకు చేరింది. మూడు రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ రెండు రోజుల్లోనే ఏకంగా 6 వేల రూపాయలు పెరగడంతో.. ఈ స్పీడ్ చూస్తుంటే లక్షను దాటేలా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఎఫెక్టుతో గోల్డ్ రేట్లు తగ్గొచ్చని విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేసి మరీ తగ్గేదేలే అంటూ రికార్డులు బ్రేక్ చేస్తోంది.
గత వారం గోల్డ్ రేట్లు భారీగా తగ్గినట్లే కనిపించడంతో..ఇంకో రెండు రోజులు ఆగితే ఇంకా తగ్గుతుందేమో అని బంగారం కొనడానికి వెయిట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు షాక్ అవుతున్నారు. తులం బంగారం కొందామని ప్లాన్ చేసుకునే లోపే మళ్లీ గోల్డ్ రేట్లు విపరీతంగా పెరగడంతో ఇక కొనలేమని నిరాశకు లోనవుతున్నారు. ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లను టెంపరరీగా నిలుపుదల చేసిన ట్రంప్ సర్కార్.. చైనాపై మాత్రం సుంకాల సమరాన్ని కొనసాగించింది.
ఆ దేశంపై ఏకంగా 145 శాతం టారిఫ్‌లను విధించడంతో..చైనా కూడా అమెరికాపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు ఆర్థిక అనిశ్చితికి కారణమవడంతో.. మాంద్యం భయాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు డాలర్ ఇండెక్స్ నూరు డాలర్లకు దిగువకు చేరడంతో పసిడికి మరింత డిమాండ్ పెంచినట్లయింది. దీనికి తోడు సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో బంగారం నిల్వలను పెంచుకోవడంతో..పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇలా ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం కూడా తగ్గడం కోసమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అమెరికా, చైనా ట్రేడ్ వార్‌తో ప్రపంచ ఆర్థిక పరిస్థితి తప్పనిసరిగా తల్లకిందులవుతుంది. ఇప్పటికే అమెరికాలో ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలు అలుముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లేషన్ పెరిగితే, దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలకు ఉన్న ఏకైక ఆయుధం బంగారం మాత్రమే. ఎందుకంటే బంగారాన్ని హెడ్జ్ ఫండ్‌గా ఉపయోగిస్తారు.
అందుకే ఇప్పుడున్న ఈ బంగారం నిల్వలే…గోల్డ్ రేట్లు తగ్గడానికి కూడా కారణం అవుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అన్ని దేశాలను ఇప్పుడు అతలాకుతలం చేస్తున్న సుంకాల సమరంతో.. ద్రవ్యోల్బణం విరుచుకుపడే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దానికి అడ్డుకట్ట వేయడానికి చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఓ ఐదారు వేల టన్నుల బంగారాన్ని.. ప్రపంచ మార్కెట్‌లో అమ్మకానికి పెడితే.. పుత్తడి రేట్లు ఒక్కసారిగా ఢమాల్‌మనే పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.