
చలికాలంలో నారింజలు తినకూడదని, ఇవి తినడం వల్ల జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయని చాలామంది వీటికి దూరంగా ఉంటారు. అంతేకాదు ఈ సీజన్లో చాలా మంది దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది పడతారు.ఇటువంటప్పుడు నారింజ పండ్లు తినడం వల్ల ఈ సమస్య పెరుగుతుందని అనుకుంటారు. కానీ సీజనల్ ఫ్రూట్ అయిన నారింజను తినడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
శీతాకాలంలో చాలామందికి రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోతుందన్న విషయం తెలిసిందే. దీని వల్లే జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు త్వరగా వస్తాయి. అందుకే ఈ సీజన్ లో సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు రోజూ తినాలని డాక్టర్లు చెబుతున్నారు. శీతాకాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ లో నారింజ కూడా ఒకటి కాబట్టి… ఈ సీజన్లో తినడం చాలా మంచిది. దీనిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీ వైరల్ లక్షణాలు ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో.. ఇది విషాన్ని బయటకు పంపడానికి, ఫ్రీ రాడికల్స్ నుంచి నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. నారింజ, ద్రాక్షపండ్లు తినడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. నారింజ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెడతాయి.
జలుబు తగ్గడానికి విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నారింజ పండ్లలో విటమిన్ సి కావాల్సినంత ఉంటుంది కాబట్టి..చలికాలంలో నిరభ్యంతరంగా తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే నారింజలో ఫైబర్ ఉండటంతో.. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది.నారింజలో ఎక్కువ శాతం ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణ శక్తిని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి చర్మానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.