సహజసిద్ధంగా లభించే కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి అమృతం లాంటివని పెద్దలు చెబుతారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని .. ఏవైనా అనారోగ్యం బారిన పడినప్పుడు ఈ నేచురల్ డ్రింక్ తాగాలని డాక్టర్లు కూడా సూచిస్తుంటారు. నిజమే కొబ్బరి నీటిలో పోషకాలు, ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి.
వేసవి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కూడా కాపాడుతుంది. అయితే అతి ఏదైనా సరే అనర్థమేనని, కొబ్బరి నీళ్ల విషయంలోనూ ఇది వర్తిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కొబ్బరి నీటిని అతిగా తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారికి రిస్క్ పెరగడంతో పాటు కొంతమందికి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లలో సహజంగా లభించే చక్కెర.. డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కొబ్బరి నీళ్లలోని ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో.. శరీరంలోని గ్లూకోజ్ లెవల్‌ను పెంచుతుంది. అందుకే షుగర్ పేషెంట్లు వైద్యుల సలహాతో కొకొనట్ వాటార్ తాగాలి. అంతేకాదు ప్రతీరోజూ కొబ్బరి నీళ్లను తాగేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
అలర్జీతో బాధపడుతున్న వ్యక్తులెవరైనా సరే.. కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ ఉన్న వ్యాక్తుల్లో కొబ్బరి నీళ్లు తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి. జీర్ణ సమస్యలు , అధిక ఎలక్ట్రోలైట్స్‌తో బాధపడుతున్న వారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
కొబ్బరి నీళ్లలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్, చక్కెర కంటెంట్ కొంతమంది వ్యక్తుల్లో.. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో అతిసారాన్ని కలిగించే అవకాశం ఉంది. అంతేకాదు జీర్ణశయాంతర సమస్యలు ఉంటే వాటిని మరింత తీవ్రతరం చేస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు పరిమితంగానే కోకోనట్ వాటర్ తాగాలి.
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో.. వీటిని అతిగా తాగితే, పొటాషియం కంటెంట్ వల్ల.. మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంది. అందుకే కిడ్నీ సమస్య ఉన్నవారు కొబ్బరి నీరు అతిగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారితో పాటు పొటాషియం తగ్గించుకునేందుకు మందులు వాడుతున్న వారు కొబ్బరినీళ్లు తాగడం మంచిది కాదు.
అలాగే కొబ్బరి నీళ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తాగితే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. కోకోనట్ వాటర్లో ఉన్న నేచురల్ షుగర్స్, శరీరంలోని క్యాలరీలను అమాంతం పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు చాలా తక్కువగా ..అది కూడా న్యూట్రిషనిస్టుల సలహాతోనే కొబ్బరి నీటిని తాగాలి.