రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండకుండా పెరిగిపోవడం డయాబెటిస్ ముఖ్య లక్షణం. ఇది నెమ్మదిగా కళ్లు, కిడ్నీలు, రక్త నాళాలు, నరాలు, మెదడు, ఇతర శరీర భాగాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నోటిలో కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. పళ్లు, చిగుళ్ల సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు.. డయాబెటిస్ ఉన్నవారికి ఏ సమస్య వచ్చినా అది తగ్గడానికి సమయం పడుతుంది. దంత సమస్యలు కూడా తగ్గడానికి వీరిలో సమయం పట్టడంతో కొత్త ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి చిగుళ్ల సమస్యలు, పెరియోడాంటల్ సమస్య, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పళ్లు పుచ్చిపోవడం, నోటి అల్సర్లు, రుచి తెలియకపోవడం, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పెరియోడాంటల్ లేదా చిగుళ్ల సమస్య పళ్ల చుట్టుపక్కల ఉన్న ఎముకలను కూడా పాడుచేస్తుంది. దవడ ఎముకలు పాడవడం వల్ల నమలడంలో ఇబ్బంది ఎదురవుతుంది.
అంతేకాదు.. ఇది నోటిలో పాచి పెరిగిపోయి బ్యాక్టీరియా పెరిగేందుకు కూడా కారణమవుతుంది. ఒకవేళ దీనికి చికిత్స తీసుకోకపోతే ఆ పాచి గట్టిబడిపోయి చిగుళ్ల నుంచి రక్తం కారే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య ఉంటే చిగుళ్లు వాయడం, ఎరుపు రంగులోకి మారడం, ముట్టుకుంటే నొప్పిగా అనిపించడం, రక్తం రావడం, చిగుళ్ల నుంచి చీము కారడం, పళ్లు వదులుగా మారడం, నోటి నుంచి దుర్వాసన రావడం, పళ్లపై పాచి పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డయాబెటిస్ సమస్య ఉన్నవారికి రక్తంలోనే కాదు.. వారి లాలాజలంలో కూడా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారి నోరు తరచూ పొడిబారిపోతుంటుంది. నోటిలోని బ్యాక్టీరియా, లాలాజలంలోని చక్కెరలతో కలిసినప్పుడు యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది పళ్లపై ఉన్న ఎనామిల్ పొరను నెమ్మదిగా కరిగిస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి పళ్ల సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే డయాబెటిక్ ఫేషెంట్స్ తరచూ డెంటిస్ట్‌ని సంప్రదిస్తూ ఉండాలి. నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
ఇలాంటి వారిలో క్యాండిడయాసిస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యలో నోటిలో ఈస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. ఫలితంగా నోరు పొడిబారుతుంది. లాలాజలంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. పళ్లు పుచ్చిపోతాయి. నోటి లోపల ఉన్న లేయర్స్ కూడా ఎరుపు రంగులోకి మారతాయి. నోటిలో అల్సర్లు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి వారు రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో పెట్టుకుంటే చాలు.. ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
నోటిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇవి పాటించండి..
ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.డయాబెటిస్ మందులు రెగ్యులర్ గా వాడాలి.ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్‌తో రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలి. పళ్ల మధ్యలో ఉన్న పాచిని ఫ్లాస్ సాయంతో శుభ్రం చేసుకోవాలి.
నోరు పొడిబారకుండా ఎక్కువగా నీళ్లు తాగడం, చూయింగ్ గమ్ నమలడం వంటివి అలవాటు చేసుకోవాలి. సిగరెట్లు తాగే అలవాటు ఉంటే మానేయాలి.