ఇప్పుడు ఎవరినీ చూసినా టాటూ లేకుండా కనిపించడం లేదు. వందమందిలో ఓ పది మంది టాటూ లేకుండా ఉంటే మిగిలిన 90మంది రకరకాల టాటూలు, తమ బాడీలో ఎక్కడో ఒక చోట వేయించుకుంటూనే ఉన్నారు. చిన్నదో , పెద్దదో వీలయితే ఒళ్లంతానో టాటూస్ వేయించుకోవడం ఒకవిధంగా స్టేటస్ సింబల్ అనేంత రేంజుకు వెళ్లిపోయారు.
తమకు నచ్చిన డిజైన్ ను టాటూగా వేయించుకుంటూ..అలా టాటూలు వేసుకుంటే ఇంకా స్టైలిష్ గా కనిపిస్తామని నమ్ముతున్నారు. అయితే ఎక్కడో కొంతమంది మాత్రమే చేతికో కాలికో టాటులు వేయించుకుంటుంటే..చాలామంది చూడటానికి కూడా భయంకరంగా ఉండేలా ఒళ్లంతా వేయించుకుంటున్నారు. అయితే ఇలా టాటూలు వేయించుకోవడం వల్ల ఏకంగా బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% ఎక్కువగా ఉంటుందని స్వీడన్ సైంటిస్టులు వెల్లడించారు. ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 20 నుంచి 60 ఏళ్ల వయస్సున్న 11వేల మందిపై అధ్యయనం చేసిన సైంటిస్టులు.. ఈ విషయాన్ని బయటకు చెప్పారు.
చర్మంపై టాటూ ఇంకు పడగానే.. మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రభావానికి గురవుతుందని స్వీడన్ సైంటిస్టులు చెబుతున్నారు . చర్మం ద్వారా ఇంక్ లింప్ నోడ్స్ లో పేరుకుపోయి.. చివరికి లింపోమా క్యాన్సర్‌కు దారి తీయోచ్చని అంటున్నారు . అయితే చిన్నచిన్న టాటూలు వేసుకున్నవారిలో పెద్దగా ప్రభావం లేకపోయినా.. టాటూ సైజును బట్టి ఈ తీవ్రత పెరిగినట్లు తాము గుర్తించామని వివరిస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో టాటూల ప్రభావంపై మరిన్ని పరిశోధనలు జరుపుతామని నిపుణులు చెప్పారు.